దేశంలో ఆర్థిక పరమైన తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచే శక్తి తేనీటికి మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి అద్భుత శక్తి కలిగిన తేనీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు, ప్రత్యేక గౌరవం కలిగించేందుకు ప్రతి ఏటా డిసెంబరు నెల 15వ తేదీని అంతర్జాతీయ తేనీటి దినోత్సవంగా పరిగణిస్తుంటారు.
ఛాయ్ వాలాగా జీవనం ప్రస్తావనం ప్రారంభించిన నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎంపికయ్యే ముందు దేశవ్యాప్తంగా ఛాయ్‌పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా విశేషాదరణ పొందింది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయగాధ కన్నా విశేషమైన విశేషమేమిటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు దేశ ప్రజలందరిని ఆహ్లాదపరిచిన అంశం చర్చతో పాటు ఛాయ్ తాగడం దేశ ప్రజల్లో తాగునీరు తరువాత ప్రజలందరూ ఎక్కువ తాగేది తేనీరు మాత్రమే.
పరిచయం పెంచుకోవడానికి..
కొంత కాలం క్రితం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన విజయవంతమైన చిత్రంలో కథానాయిక ఇంటికి కథానాయకుడి బృందం వెళుతుంది. ఎందుకంటే పరిచయాలు పెంచుకోవడానికి అంటూ చెబుతుంటారు. ఈ విధంగా పరిచయాలు పెంచుకోవడంలో తేనీరు కీలక పాత్ర పోషిస్తుంది.
రోజూ ప్రతి సమయంలోనూ తేనీటిదే కీలక పాత్ర. నిద్రలేచిన తరువాత తొలుత తేనీటిని తాగనిదే రోజు ప్రారంభం కాదు. చలికాలంలో వెచ్చదనాన్ని, వర్షాకాలంలో ఆహ్లాదాన్ని ఆస్వాదించాలంటే నాలుకపై వేడి వేడి తేనీటి చుక్క పడాల్సిందే. మనస్సు ఆనందంతో ఓలలాడాల్సిందే. ఆనందమైనా, ఆవేదనయినా, ఆందోళనైనా, ఆలోచనకైనా తేనీరు తాగడం ప్రతి ఒక్కరికీ అలవాటు. విసుగు చెందినా, విరామం కోరుకున్నా, వెన్నెల్లో హాయిగా ఆనందం పంచుకోవాలన్నా తేనీరు తోడు ఉండాల్సిందే. స్నేహితులు, సన్నిహితులకు తోడు తేనీరు పన్నీరులాగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఎన్ని రకాల 'టీ'లో...
తొలుత గ్రామీణ ప్రాంతాల్లో తేయాకు పొడిని వేడినీళ్లలో ఉడికించి డికాక్షన్ తయారు చేసుకుని, ఇందులో పాలు, చక్కెర కలుపుకొని తేనీటిని ప్రజలు తాగేవారు. తరువాత దీనిస్థానంలో తేయాకు పొడిని పెద్ద మొత్తంలో ఒకే సారి ఉడికించి, ఆ తరువాత అవసరమైనప్పుడు పాలు చక్కెర కలిపి ఇచ్చేవారు. దీన్ని ధమ్ టీగా పిలిచేవారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల మాదిరిగా వివిధ రకాలుగా తేనీరు తయారీ జరుగుతుండటం విశేషం. ఇరానీ టీ, లెమన్ టీ, మసాలా టీ, బాదం టీ, కోకో టీ, గులాబీ టీ , చామంతి టీ, జింజర్ టీ, పుదీనా టీ, అల్లంటీ, తులసీ టీ, బట్టర్ టీ వంటికి అందుబాటులోకి వచ్చాయి. వీటికి చెందిన పొడులు అందుబాటులో ఉన్నందున ప్రతీ ఒక్కరు వివిధ రకాల రుచులు, రంగులు, వాసనలు కలిగిన టీ తాగుతున్నారు.