తెలంగాణ

telangana

ETV Bharat / international

కాబూల్‌లో రాకెట్ల దాడి.. 8 మంది మృతి

14 rockets landed in various parts of Kabul today morning
కాబుల్​పై రాకెట్​ దాడులు

By

Published : Nov 21, 2020, 11:33 AM IST

Updated : Nov 21, 2020, 1:42 PM IST

13:40 November 21

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్‌ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 20కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు, వ్యాపార సమూహాలు, అంతర్జాతీయ కంపెనీలు ఉన్న గ్రీన్‌జోన్‌కు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడం వల్ల అఫ్గాన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాకెట్ల దాడిలో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. ఖతార్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, తాలిబన్‌ మధ్య నేడు చర్చలు జరగనున్న కొద్ది గంటల ముందే కాబూల్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. కాగా.. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌ ప్రకటించింది. 

అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ మధ్య ఈ ఏడాది సెప్టెంబరులో శాంతి చర్చలు ప్రారంభమవగా.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనబడలేదు. ఓ వైపు చర్చలు జరుపుతూ మరోవైపు పేలుళ్లకు పాల్పడుతున్నారు తాలిబన్లు. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. ఆసియా దేశాల పర్యటనలో ఉన్న మైక్‌ పాంపియో.. నేడు ఖతార్‌లో పర్యటిస్తున్నారు. తాలిబన్‌, అఫ్గాన్‌ ప్రభుత్వంతో పాంపియో కీలక చర్చలు జరపనున్నారు.

11:28 November 21

కాబుల్​పై రాకెట్​ దాడులు.. ముగ్గురు మృతి

కాబుల్​పై రాకెట్​ దాడులు

రాకెట్ దాడులతో అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం ఉదయం నగరవ్యాప్తంగా 14చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ విషయాన్ని అఫ్గాన్​ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

నగరంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బాంబుల శబ్దాలు విని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

Last Updated : Nov 21, 2020, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details