మయన్మార్, ఆ దేశ ఆర్థిక రాజధాని యాంగోన్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. తమ ప్రియతమ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని, మిలిటరీ ప్రభుత్వం గద్దె దిగాలన్న నినాదాలతో యాంగూన్ దద్దరిల్లుతోంది. ఇక మాండలేతో మయన్మార్‌లోని పలు ఇతర నగరాలు, ప్రదేశాల్లో కూడా నిరసనలు రాజుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
యాంగోన్‌లో ప్రముఖ సులె పగోడా కేంద్రంగా అహింసాయుత ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ 1998, 2007 నాటి ప్రజా ఉద్యమాలను అప్పటి మిలిటరీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసింది. నాటి ఘర్షణల్లో వేల మంది మరణించినట్టు వార్తలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘటనల పట్ల వెనుదీయకుండా వేల సంఖ్యలో కార్మిక, విద్యార్థి సంఘాలు, పౌరులు యాంగూన్ విశ్వవిద్యాలయం సమీపంలో సమావేశమయ్యారు. అనంతరం జాతీయ రహదారి వైపుగా సాగిన ప్రదర్శనకు.. వాహనాల డ్రైవర్లు హారన్లు మోగించి తమ మద్దతు తెలియచేశారు.