ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్న తరుణంలో వైరస్‌ను కట్టడి చేయగలిగిన థాయ్‌లాండ్‌లో.. ఒక్కసారిగా భారీగా కేసులు వెలుగు చూశాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవటం వల్ల.. ప్రజలు భయంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారి వేలాది మంది పరీక్షా కేంద్రాలకు చేరుకోవటం వల్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.
సముత్ సాఖోన్ రాష్ట్రం మహచాయ్లోని పరీక్ష కేంద్రం వద్ద మూడు వరుసల్లో 100 మీటర్ల మేర బారులు తీరారు జనం. అందులో ప్రధానంగా వలస కార్మికులే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాత్రి కర్ఫ్యూ, ప్రయాణాలపై జనవరి 3 వరకు ఆంక్షలు విధించారు. షాపింగ్ మాల్స్, పాఠశాలలు, సినిమాహాళ్లు, స్పా కేంద్రాలు, క్రీడామైదానాలు మూసివేయాలని ఆదేశించారు.