తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పుట్టుకలో ఈ మిస్టరీ మహిళల పాత్రేంటో తెలుసా? - చైనా మహిళా శాస్త్రవేత్త

అంతా మిస్టరీ! ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న ప్రాణాంతక వైరస్‌ కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహాగానాలు ఎందరిపైనో అనుమానాలు!! ఇది చేపల మార్కెట్లో పుట్టిందని చైనా చెబుతోంది. ‘అంతకు మించి ఏదో జరిగిందని మిగతా ప్రపంచం అంటోంది. ఈ మిస్టరీ ఇప్పుడు కొందరు మహిళల చుట్టూ తిరుగుతోంది. పేషెంట్‌ జీరోలు.. చైనా కీలక మహిళా శాస్త్రవేత్తల పాత్రపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అదేంటో తెలుసుకుందాం..

this-mystery-womans-role-in-the-origin-of-corona
కరోనా పుట్టుకలో ఈ మిస్టరీ మహిళల పాత్రేంటో!

By

Published : Apr 29, 2020, 7:40 AM IST

ప్రపంచ దేశాలను కరోనా కలవరపరుస్తోన్న వేళ.. ఈ మహమ్మారిపై కట్టుకథలెన్నో వచ్చాయి. వైరస్​ను​ సృష్టించింది చైనానే అని అమెరికా ఆరోపిస్తుంటే.. 'ఆ వైరస్‌ పురుగును అమెరికానే మా వుహాన్‌లో వదిలింది, అమెరికా సైనికురాలే దీనికి కారణం' అని చైనా ఆరోపించింది. 'వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలేవో మేమూ చూస్తాం. మాకో అవకాశం ఇవ్వండి' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా, వివిధ దేశాల నేతలు చేస్తున్న డిమాండ్‌ను చైనా తోసిపుచ్చుతోంది. ఇంతకీ కరోనా మిస్టరీలో ఆసక్తి రేపుతున్న మహిళలు ఎవరు? వారి పాత్ర ఏమిటి? చూద్దాం..

ఆమెపై ఐదు కళ్లు..

షి జియాంగ్‌లీ

చైనాలోని టాప్‌ వైరాలజిస్టుల్లో ఒకరైన షి జియాంగ్‌లీ పేరు ఇప్పుడు కరోనా వైరస్‌ లీకేజీ కుట్ర కోణంలో వినిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న 'ఫైవ్‌ఐస్'’గా పిలిచే అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల సంయుక్త ఇంటెలిజెన్స్‌ విభాగం ఈమె పాత్రపైనా దృష్టి పెట్టినట్లు 'డైలీ మెయిల్‌' కథనం పేర్కొంది. గతంలో ఈమె మరో శాస్త్రవేత్తతో కలిసి ఆస్ట్రేలియాలో 'ది కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్'’లో గబ్బిలాల్లోని వైరస్‌లపైనే పరిశోధనలు చేశారు. వాటిని చైనాలోనూ కొనసాగించారు. కరోనా చైనాలో విస్తరించిందనే వార్తలు రాగానే ‘మా ల్యాబ్‌ నుంచి బయటికి రాలేదు కదా?’ అంటూ ఓ పత్రిక వద్ద నోరుజారారు. అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోయింది. అమెరికాలోని గాల్వెస్టన్‌ పీ4 ల్యాబ్‌ శాస్త్రవేత్తలు కూడా వుహాన్‌లో లీకేజీ జరిగే అవకాశం లేదని చెప్పారు. కానీ, అప్పటికే ల్యాబ్‌ను చైనా సైన్యం 'పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ' చేతిలోకి తీసుకొంది.

హునాన్‌ మార్కెట్లో పేషెంట్‌ జీరో

.

హునాన్‌ సముద్ర జీవుల మార్కెట్లో రొయ్యలను విక్రయించే వుయ్‌ జూషాన్‌ అనే మహిళ పేరును తొలుత పేషెంట్‌ జీరోగా 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్'’ పేర్కొంది. ఆ మార్కెట్లో మరుగుదొడ్డిని వినియోగించడంతో తాను వైరస్‌ బారిన పడినట్లు జుషాన్‌ చెబుతోంది. నిరుటి డిసెంబర్‌ 10న ఈమెలో వైరస్‌ లక్షణాలు కనిపించాయి. స్థానికంగానే చికిత్స చేయించుకొంది. కానీ, తగ్గకపోవడంతో వుహాన్‌లోని ఎలవెన్త్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి యూనియన్‌ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వెద్యులు కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించి మార్కెట్‌ను మూసేయించారు. ఆమెకు కచ్చితంగా ఎక్కడి నుంచి వైరస్‌ సోకిందో చెప్పలేకపోతున్నారు. దీంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఆమెను పేషెంట్‌ జీరోగా పరిగణించడంలేదు.

తెరపైకి సైనిక జనరల్‌

సైన్యం మేజర్‌ జనరల్‌ చెన్‌వీ

చైనా సైన్యం మేజర్‌ జనరల్‌ చెన్‌వీ పేరూ ఇప్పుడు వార్తల్లో నానుతోంది. పీఎల్‌ఏకు చెందిన ఆమె చైనాలోనే అత్యుత్తమ వైరాలజిస్టు, అంటువ్యాధుల నిపుణురాలు. కరోనా విజృంభించిన జనవరి 26న ఆమె తన బృందంతో వుహాన్‌ చేరుకొని పీ4ల్యాబ్‌ను తన ఆధీనంలోకి తీసుకొన్నట్లు ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ వెల్లడించింది. 'ది అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సెస్‌'కు చెందిన ఆమె బృందం టీకా రేసులో బాగా ముందుంది. ప్రస్తుతం వీరు తయారు చేసిన టీకాను మనుషులపై ప్రయోగించేందుకు మార్చిలోనే అనుమతులు లభించాయి. టీకా తీసుకొన్న వారిలో చెన్‌వీ కూడా ఉన్నారు. 2003లో సార్స్‌ వ్యాపించినపుడు వైద్య సిబ్బంది ఆ వ్యాధి బారినపడకుండా నాసికా రంధ్రాల్లో వినియోగించే స్ప్రేను చెన్‌ కనిపెట్టారు. 2014-16 మధ్యలో ఎబోలా విజృంభించినప్పుడూ ఆమె చురుగ్గా పరిశోధనలు చేశారు.

ఈమె మరో పేషెంట్‌ జీరో!

.

వుహాన్‌ ల్యాబ్‌లో వైరస్‌ లీకైందని ప్రచారం చేస్తున్నవారు 'హువాంగ్‌ యాన్లింగ్‌' అనే పరిశోధకురాలి పేరును ‘పేషెంట్‌ జీరో’గా చెబుతున్నారు. ఆమె వైరస్‌ ప్రభావంతోనే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆమె ఫొటో, వివరాలను ల్యాబ్‌ జాబితా నుంచి తొలగించి ఒక్క పేరు మాత్రమే ఉంచారని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఖండిస్తోంది. ‘హువాంగ్‌ మావద్ద 2015 వరకు విద్యార్థిగా ఉంది. 2015లోనే ఆమె ఇన్‌స్టిట్యూట్‌ను వదిలి వెళ్లారు. ఇప్పటివరకు తిరిగి రాలేదు. ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కొవిడ్‌ సోకలేదు’’ అని పేర్కొంది. అయితే... చైనాలోని పరిశోధనశాలల్లో వైరస్‌ లీకైన చరిత్ర ఉంది. 2004లో ఇక్కడ ఒక పరిశోధనశాలలో ‘సార్స్‌ వైరస్‌’ లీకై ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు.

'అమెరికా కుట్ర' కోణంలో సైనిక మహిళ

చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిజియాన్‌ ఝా

'అమెరికానే మా దేశంలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసింది'- ఇది చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిజియాన్‌ ఝా మార్చిలో చేసిన ప్రకటన. అమెరికా సైన్యం రిజర్వ్‌ దళాల్లో పనిచేస్తున్న మాట్జే బెనస్సీ వైపు వేలెత్తి చూపడం ఈ ప్రకటన సారాంశం. ఆమె వర్జీనియాలో భద్రతా అధికారిణిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే. గత అక్టోబర్‌లో వుహాన్‌లో నిర్వహించిన సైనిక ఒలింపిక్స్‌లో సైక్లింగ్‌ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. అప్పుడామె ప్రమాదానికి గురై పక్కటెముక విరగ్గా జట్టు నుంచి తప్పించారు. ఈ ఘటనే ఇప్పుడు వదంతులు పుట్టించేవారికి అవకాశంగా మారింది. చైనా ఆరోపించిన వెంటనే అమెరికాలో వదంతులను సృష్టించడంలో సిద్ధహస్తులు కరోనా వైరస్‌కు, మాట్జేకు లంకెకట్టి ప్రచారానికి తెరతీశారు. మాట్జే దంపతుల వ్యక్తిగత సమాచారాన్ని, ఇంటి చిరునామాను చైనా నెటిజన్లు సంపాదించి సోషల్‌ మీడియాలో పెట్టారు. దాంతో కథనాలు వెల్లువెత్తాయి.

ABOUT THE AUTHOR

...view details