ప్రపంచవ్యాప్తంగా కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. స్పెయిన్‌లో గత 24 గంటల్లో 849 మంది ప్రాణాలు కోల్పోయారంటే కరోనా ప్రపంచంపై ఎలా పంజా విసురుతుందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 38,466కు చేరింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8 లక్షలు దాటింది. ఇందులో 1,63, 300 మంది కోలుకున్నట్లు సమాచారం. చిన్నదేశాలైన టాంజానియా, ఐవరీ కోస్ట్‌లలో తొలి మరణాలు సంభవించగా.. దక్షిణ సుడాన్లో తొలిసారి ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలు దాటిన కేసులు స్పెయిన్‌లో 849 మంది
కరోనా ధాటికి స్పెయిన్ అతలాకుతలం అవుతోంది. స్పెయిన్‌లో గత 24 గంటల్లో 849 మంది చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 8189కు చేరింది. అంతేకాకుండా 9,222 మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడటం వల్ల.. బాధితుల సంఖ్య 94,417కు చేరింది.
ఇప్పటికే ఈ దేశంలో అంత్యక్రియలపైనా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. శ్మశాన వాటికకు ముగ్గురు కంటే ఎక్కువ వెళ్లొద్దని ఆదేశించింది. ఏప్రిల్ 11 వరకు మతపరమైన వేడుకలు నిర్వహించవద్దని చెప్పింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఒకటి లేదా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని సూచించింది. రెండు వారాలు ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు లేకుండా లాక్డౌన్ చేసింది.
అమెరికా @ 3170
అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది.గత 24 గంటల్లో ఒక్క న్యూయర్క్లోనే 250 మంది చనిపోయారు. ఈ మహమ్మారి దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య 3,170కు చేరింది. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే 1,64,610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల మంది హెల్త్‌కేర్ వర్కర్లు కావాలని న్యూయర్క్ గవర్నర్ ఆండ్రూ కుమో కోరారు.
ఫ్రాన్స్‌లో శవాల గదులు చాలట్లేదు..
సాధారణంగా వాయవ్య పారిస్ ప్రాంతంలో మార్చరీలకు రెండో, మూడో మృతదేహాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు వందల కొద్ది శవపేటికలు తరలి వస్తుండటం వల్ల వాటిని పెట్టేందుకు కోల్డ్ ఛాంబర్లు అన్నీ నిండిపోతున్నట్లు శ్మశానవాటికల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఉన్న 32 ఛాంబర్లు మృతదేహాలతో నిండిపోయాయని... మరో ఆరు గదులు కొత్తగా కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా 3,024 మంది చనిపోయారు. 44,550 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. ప్రస్తుతం ఈ దేశంలోనూ లాక్డౌన్ కొనసాగుతోంది.
ఇరాన్లో 141 మంది మృతి..
ఇరాన్లో మంగళవారం ఒక్కరోజే 141 మంది చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మొత్తం 2898కి చేరింది. ఇరాన్లో మళ్లీ 3111 కేసులు రావడం వల్ల.. బాధితుల సంఖ్య 44వేల 606కు చేరింది. 3,703 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,4656 మంది కోలుకున్నారు. అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఐరోపా దేశాల నుంచి ఇరాన్‌కు తొలిసారి వైద్య సహాయం అందింది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇరాన్‌కు సాయం అందించాయి.
చైనాలో మళ్లీ మరణం..
చైనాలో కొత్తగా 48 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే వాళ్లు చైనా స్థానికులు కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. చనిపోయిన వారి సంఖ్య 3,305కు చేరింది. మంగళవారం హూబేయ్ రాష్ట్రంలో మళ్లీ ఒక మరణం నమోదైంది. మొత్తం కేసులు 81,518కి చేరింది. ఇందులో 2,161 మంది చికిత్స పొందుతుండగా.. 76,052 మంది డిశ్ఛార్జీ అయ్యారు. సోమవారం ఒక్కరోజే 282 మంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చైనాలో శనివారం నుండి దాదాపు 98.6 శాతం సంస్థలన్నీ తిరిగి పనులు ప్రారంభించాయి.
ఇటలీలో లక్ష దాటిన బాధితులు..
ఇటలీలో ఇప్పటివరకు 11,591 మంది చనిపోగా.. 101,739 మంది వైరస్ బారిన పడ్డారు. 14,620 మంది కోలుకున్నారు.