తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాతో ప్రపంచం విలవిల.. 57 దేశాలకు వ్యాప్తి - who

ఒక మహమ్మారి జగతిని కమ్ముకుంటోంది. భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తోంది. మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంపై ప్రత్యేక కథనం.

The world is raging with the corona virus
కరోనా వైరస్​తో ప్రపంచం విలవిల

By

Published : Feb 29, 2020, 6:46 AM IST

Updated : Mar 2, 2020, 10:27 PM IST

కరోనా వైరస్‌(కొవిడ్‌ 19).. ఇప్పుడిది చైనాలోని వుహాన్‌కే పరిమితమైన అంటువ్యాధి కాదు. దాని సరిహద్దుల్ని ఎప్పుడో దాటేసి.. విశృంఖలంగా విజృంభిస్తూ.. అనేకానేక దేశాలను చుట్టబెట్టేస్తోంది. చైనాలో నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటే.. బయటిదేశాల్లో మాత్రం ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌కు 'ప్రపంచ అంటువ్యాధి'గా మారే సత్తా ఉందన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికల్ని ముమ్మాటికీ నిజం చేస్తోంది. వివిధ దేశాల్లో శీఘ్రగతిన వ్యాపిస్తూ.. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. ఒక్క అంటార్కిటికా తప్ప మొత్తం ఆరు ఖండాల్నీ ఈ వైరస్‌ చుట్టేసింది. దీంతో అనేకదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో అల్లకల్లోలం రేగుతోంది. ఆరోగ్య సంక్షోభాలు తలెత్తుతున్నాయి. జనం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా, వైరస్‌ సోకిన దేశాలకు ప్రయాణించకుండా వివిధ దేశాలు నిషేధం విధిస్తున్నాయి. విమాన సర్వీసుల్ని రద్దుచేస్తున్నాయి. వైరస్‌ సోకినవారిని బలవంతంగా ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

చైనా తర్వాత అత్యధిక కేసులు దక్షిణ కొరియా(2337)లో నమోదయ్యాయి. దేశంలో మరణాలు అంతకంతకూ పెరుగుతుండడంతో దక్షిణకొరియా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికే వణుకుతున్నారు. దీని దెబ్బకు హ్యుందాయ్‌ మోటార్స్‌ తన ప్లాంట్లలో ఒకదాన్ని తాత్కాలికంగా మూసేస్తోంది. దేగూ నగరం, చెంగ్డో కౌంటీల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్​తో ప్రపంచం విలవిల

ఇరాన్‌ గజగజ..

ఇరాన్‌లో నమోదైన కేసులు తక్కువే అయినా.. ఎక్కువ మరణాలు(34) సంభవిస్తుండడం ఈ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏకంగా ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్తేకర్‌కు, ఆరోగ్య ఉపమంత్రికి వైరస్‌ సోకింది. వాటికన్‌లో ఇరాన్‌ తొలి రాయబారి హదీ ఖోస్రోసాహి ఈ వైరస్‌ సోకి మరణించారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఇరాన్‌ శుక్రవారం ప్రార్థనల్నీ రద్దుచేసింది. దాదాపు 10 ప్రావిన్సుల్లో పాఠశాలల్ని మూసేశారు.

కరోనా వైరస్​తో ప్రపంచం విలవిల

ఏ దేశంలో ఏం జరుగుతోంది?

* జపాన్‌లోని రెండో అతిపెద్ద ద్వీపం హొకైడోలో అత్యవసర పరిస్థితిని విధించారు. టోక్యోలోని డిస్నీ రిసార్ట్‌, యూనివర్సల్‌ స్టూడియోలను రెండు వారాల పాటు మూసేశారు. మార్చి రెండోతేదీ నుంచి ఏప్రిల్‌ దాకా దేశంలోని దాదాపు 40 వేల పాఠశాలల్నీ మూసేస్తారు. జపాన్‌ తీరంలోని యొకొహామాలో నిలిపిఉంచిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలోని 705 మందికి ఈ వైరస్‌ సోకింది. ఆరుగురు మృత్యువాత పడ్డారు.

* వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తిని అమెరికా నిఘా సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ విదేశీ ప్రయాణం చేయకున్నా.., వ్యాధిగ్రస్తులనూ కలవకున్నా... వైరస్‌ బారిన పడడంతో ఆందోళన చెందుతున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

* జర్మనీ.. సంక్షోభ నివారణ బృందాన్ని ఏర్పాటుచేసింది. వైరస్‌ సోకినవారికి ఎక్కడికక్కడ చికిత్సలు అందిస్తున్నారు.

* బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మించి గుమికూడకుండా స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. మార్చి 5వ తేదీన జరగాల్సిన జెనీవా ఆటోషోను రద్దుచేసింది.

* చైనా, దక్షిణకొరియా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, మకావూ, ఇటలీని సందర్శించి వచ్చిన వారందరినీ ఇజ్రాయెల్‌ క్వారెంటైన్‌లో ఉంచింది.

* వ్యాధి ప్రబలకుండా నిరోధించడానికి సౌదీ అరేబియా వీసాలను రద్దుచేసింది.

* ఇరాన్‌కు వచ్చిపోయే విమానాలన్నింటినీ యూఏఈ రద్దుచేసింది.

* ఇటలీలోని మిలన్‌కు 22 విమాన సర్వీసుల్ని బ్రిటన్‌ ఉపసంహరించుకుంది.

* వైరస్‌ భయంతో అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు.

* ఇటలీలోని 11 పట్టణాల ప్రజల్ని ఇళ్ల నుంచి బయటికి రానివ్వడం లేదు. ఐదు నగరాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్ని మూసేశారు. వెనెటో, లాండోర్డీలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని రద్దుచేశారు.

కరోనా వైరస్​తో ప్రపంచం విలవిల
కరోనా వైరస్​తో ప్రపంచం విలవిల
Last Updated : Mar 2, 2020, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details