Russia-Ukraine conflict: ఉక్రెయిన్ సారవంతమైన నేలలతో కూడిన మైదాన ప్రాంతం. రష్యా నుంచి ఆక్రమణలను అడ్డుకొనే ప్రకృతి సహజమైన పర్వతాల వంటి అడ్డుకట్టలు లేవు. దీంతో దాడులు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే రష్యా సాయుధ వాహనాలు సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలకు చేరుకొన్నాయి. కానీ, ఇక్కడ వారికి అసలైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ నగర వాసులు కూడా రష్యా దళాలపై ఆగ్రహంగా ఉండటంతో వారే ఆయుధాలు పట్టారు. దీనికి తోడు నాటో బలగాలు చిన్న ఆయుధాలను ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రధాన నగరాలు రష్యాకు కొరకరాని కొయ్యగా మారతాయి. దీంతో ఇరుపక్షాలు భారీగా ఆస్తిప్రాణ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది.
నగరాల స్వాధీనం కష్టం..
ఇటీవల కాలంలో నగరాల స్వాధీనం కోసం జరిగే పోరాటాలు కొన్ని నెలల పాటు కొనసాగిన సందర్భాలను మనం చూశాము. ప్రభుత్వాలను కూలదోయడానికి నగరాలను స్వాధీనం చేసుకొంటుంటారు. ముఖ్యంగా రెబల్స్ ఆధీనంలోని 2014లో డాన్‌బాస్ ప్రాంతంలోని ఇలోవైస్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ దళాలకు దాదాపు 50 రోజులు పట్టింది. 2016 అక్టోబర్ నుంచి ఇరాక్‌లోని మొసూల్ స్వాధీనం చేసుకొవడానికి అమెరికా సంకీర్ణ దళాలు 2017 జనవరి వరకు పోరాడాల్సి వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
నగర రక్షణ కోసం పోరాడే దళాలకు పట్టణాలు అనువైన ప్రాంతాలు. అంటే పెద్దగా బలం లేకపోయినా పోరాడాలనే కసి ఉన్నవారికి అనువుగా ఉంటుంది. దీంతో దాడి చేయడానికి వచ్చేవారు భారీ ఎత్తున సాయుధ వనరులను తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే నిర్మాణాలు సైనిక స్థాయి డిఫెన్సివ్ పొజిషన్లను అందిస్తాయి. ఈ కారణంతోనే కీవ్‌లోకి ఇప్పటికీ రష్యా సేనలు చొచ్చుకుపోలేకపోతున్నాయి.
ఇంటెలిజెన్స్‌లో ఆధిక్యం: దాడి చేయడానికి బయట నుంచి వచ్చేవారి ఇంటెలిజెన్స్‌ను పట్టణప్రాంతాలు కుదించేస్తాయి. దీంతోపాటు నిఘా, పర్యవేక్షణలు కూడా వారికి కష్టంగా ఉంటాయి. అటాకర్స్ వైమానిక ఆస్తులు కచ్చితత్వంతో పనిచేయడం కష్టం. అంతేకాదు.. సుదూరంగా సురక్షిత ప్రాంతంలో ఉండి లక్ష్యాలపై దాడి చేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఆధునిక సైన్యాలు వాడే ఆయుధాల్లో చాలా వరకు సుదూరం నుంచి లక్ష్యాలు ఛేదించేవే.
శత్రువు కదలికలపై కన్ను: నగర రక్షణకు పోరాడే బృందాలు దాడికి వచ్చిన వారి కదలికలను స్పష్టంగా గమనించే పొజిషన్లలో ముందు నుంచే ఉంటాయి. దాడి చేసేందుకు బయట నుంచి వచ్చేవారు దాడులను తప్పించుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అందుకే రష్యా సైన్యం కీవ్ స్వాధీనం కోసం పట్టణ పోరాటాల కోసం డిజైన్ చేసిన బీఎంపీటీ-72 సాయుధ వాహనాలు పంపుతోంది. వీటిని టీ-72 ట్యాంక్‌ల నుంచి అభివృద్ధి చేశారు.
నగరాలు పూర్తిగా కాంక్రీట్ నిర్మాణాలతో నిండిపోయి ఉంటాయి. దీంతో నగర రక్షణ దళాలకు ఇవి సైనిక బంకర్ల వలే రక్షణ ఇస్తాయి. ఆక్రమణదారులు ఈ భవనాలను మొత్తం తనిఖీలు చేస్తూ ప్రతిఘటన లేకుండా చూసుకొంటూ ముందుకెళ్లాలి. అదే ప్రభుత్వ భవనాలు, పారిశ్రామిక భవనాల్లోని బలమైన ఇనుప నిర్మాణాలు ఆయుధాలకు తొందరగా దెబ్బతినవు. నగర రక్షణ దళాలు వీటిని ఆసరాగా చేసుకొని దాడులు చేసే అవకాశాం ఉంది. పట్టణ పోరాటాల్లో పేలుడు పదార్థాలు వాడటానికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి.
పట్టణాల్లో నిర్మించిన భూగర్భ బంకర్లు, సొరంగాల్లో నగర రక్షణ దళాలు దాక్కొని ఆక్రమణదారులపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇరాక్, సిరియా, తూర్పు ఉక్రెయిన్లో ఈ రకమైన పోరాటాలు జరిగాయి.