కళ్లముందు కదలాడుతున్న తాలిబన్ల(Afghanistan taliban) అరాచక పాలన.. తుమ్మినా, దగ్గినా కఠిన ఆంక్షలు.. క్షణక్షణం ప్రాణ భయం.. దేశం విడిచి పారిపోదామంటే అందుబాటులో పరిమితంగా విమానాలు.. విమానం దొరికినా తాలిబన్ల కట్టుదిట్టమైన తనిఖీలు.. ఇవీ అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు సహా అఫ్గాన్ వాసుల అవస్థలు. అయినా.. అఫ్గాన్‌ను(Afghanistan crisis) వీడే రోజు తప్పక వస్తుందని అనేక మంది పిల్లా పాపలతో కాబుల్ విమానాశ్రయంలో రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు.
2021 ఆగస్టు 15 అఫ్గానిస్థాన్ చరిత్రలో చీకటి రోజు. అఫ్గాన్ గడ్డపై నుంచి 20ఏళ్ల పాటు ఉగ్రవాదంపై పోరాటం చేసి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించడం వల్ల ఉగ్ర సంస్థ తాలిబన్ ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. 1996 నుంచి 2001 వరకు అఫ్గానిస్థ్న్ను పాలించిన తాలిబన్లు తమను ఎలా పీడించారో గుర్తు చేసుకున్న ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. ఇక అమెరికా, బ్రిటన్, భారత్ సహా ఇతర దేశాలు సైతం ప్రత్యేక విమానాలు నడిపి మరీ తమ దేశస్థులను స్వదేశం తరలించాయి. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తాలిబన్లు గడువును ఆగస్టు 31 వరకు విధించగా, ఆ లోపు కొన్ని దేశాలు తమ వారిని స్వదేశం తరలించలేకపోయాయి. వారంతా అఫ్గాన్‌లోనే చిక్కుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అఫ్గాన్ వాసులు సైతం అదే యత్నాల్లో ఉన్నారు. అయితే అఫ్గానిస్థాన్ నుంచి విమాన సర్వీసులు పరిమితంగా ఉండడం, తాలిబన్లు అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో అఫ్గాన్‌ను వీడాలన్న వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.