ఓవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మరోవైపు కవ్వించే చర్యలతో సరిహద్దుల్లో దురుసు వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా.. తన అధికార మీడియా గ్లోబల్ టైమ్స్‌తో విషం చిమ్ముతోంది. భారత్‌తో తేల్చుకోవడానికి సిద్ధమంటూ పరోక్షంగా హెచ్చరికలు చేసే దుస్సాహసం చేసింది. తాజాగా ఆ పత్రికకు సంపాదకుడిగా ఉన్న హు షిజిన్ తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలోనూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. చైనాను భారత్ తక్కువగా అంచనా వేస్తోందంటూ వ్యాఖ్యానించారు. డ్రాగన్ యుద్ధం గెలవలేదని భారత్ తక్కువగా అంచనా వేస్తోందని విశ్లేషించారు.
'భారత్ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది' - india china border news
సరిహద్దు విషయంలో యుద్ధం చేయాల్సి వస్తే చైనా యుద్ధం గెలవలేదనే అపోహలో భారత్ ఉందన్నారు చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ సంపాదకుడు హు షిజిన్. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసం చైనా సైనికుల్లో ఉందని.. తక్కువ అంచనా వేయవద్దని సూచించారు..
"నా అంచనా ప్రకారం.. 1962కు ముందు తరహాలోనే చైనాను భారత్ చాలా తక్కువ అంచనా వేస్తోంది. చైనా యుద్ధం చేయలేదని తీర్మానించుకుంది. కానీ, చైనా సైన్యం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమయింది. ఘర్షణలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉంది. ఆయుధాలను ఉపయోగించే విషయంలో కుదిరిన ఒప్పంద నిబంధనలను భారత్ సవరిద్దామనుకుంటుందా? చైనా వద్ద భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇరు వర్గాలు సైనిక ఘర్షణకు దిగితే.. భారత్ 1962 కంటే దారుణమైన ఓటమిని చవిచూస్తుంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ బాధ్యతగల పాత్రికేయుడిగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాల్సింది పోయి.. ఆయనే అగ్నికి ఆజ్యం పోసే దుశ్చర్యకు పాల్పడ్డారు. 1962 నాటి యుద్ధాన్ని ఉటంకిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిస్థితులు, మన సైన్యం సంసిద్ధత, భారత ఆయుధ సంపత్తిపై తన అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు. సైనిక ఘర్షణ సిద్ధమంటూ చివరకు తన వృత్తి ధర్మాన్ని, బాధ్యతల్ని మరచి ప్రవర్తించారు.
అంతకుముందు భారత్ అప్రమత్తతను, పైఎత్తులను జీర్ణించుకోలేకపోతున్న చైనా ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయంలో భారత సైనికులు హద్దులు మీరుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాసుకొచ్చింది. భారత సైన్యం మాత్రం గత రాత్రి చైనాయే కాల్పులకు పాల్పడిందని స్పష్టం చేసింది. మన సైన్యం ఎంతో నేర్పుతో సహనం వహించిందని వివరించింది.