భారత్ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తోన్న వార్తలపై డ్రాగన్ స్పందించింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఔషధ సంస్థలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది. టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా హ్యకర్ బృందాలు దాడులు చేస్తున్నాయన్న నివేదికలను తప్పుబట్టింది. ఇక భారత పోర్టులపైనా చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ రికార్డెడ్ ఫ్యూచర్ చేసిన ఆరోపణలను ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిపై నిందలు వేయడం బాధ్యతారాహిత్యం, దుర్మార్గమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. సంబంధింత నివేదికను భారత్ కూడా ఖండించినట్లు గమనించానని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
చైనా హ్యాకర్లు.. భారత్ వ్యవస్థలపై యాక్టివ్‌గానే!
మరోవైపు, భారత్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థలు, వ్యవస్థలే లక్ష్యంగా చైనా హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ వ్యవస్థలు, ఔషధ సంస్థల ఐటీ విభాగాలపై హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అంతర్జాతీయ సంస్థలు నివేదించిన విషయం తెలిసిందే. ఇవి మరువక ముందే తాజాగా భారత్‌లోని పోర్టులపైనా చైనా హ్యాకర్లు క్రియాశీలకంగానే తమ దాడులను కొనసాగిస్తున్నట్లు అమెరికాకు చెందిన సంస్థ అప్రమత్తం చేసింది. చైనా ప్రభుత్వ సహకారంతో నడుస్తోన్న అక్కడి హ్యాకింగ్ బృందాలు భారత వ్యవస్థలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. వివిధ వ్యవస్థలపై జరుపుతోన్న ఈ సైబర్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ వెల్లడించింది. భారత మారిటైమ్ పోర్టుపై చైనా హ్యాకర్ల నుంచి మంగళవారం కూడా ట్రాఫిక్ మార్పిడి కావడాన్ని గమనించవచ్చని రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది.