థాయ్‌లాండ్‌లో విద్యార్థుల నిరసనలు హోరెత్తుతున్నాయి. అత్యయిక స్థితిని ధిక్కరిస్తూ రాజధాని బ్యాంకాక్‌లో వరుసగా రెండో రోజు భారీ ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు. ప్రధాని ప్రయుత్ చాన్-ఒచా రాజీనామా, రాజ్యాంగ సవరణ సహా, దేశంలో రాచరిక పాలనలో సంస్కరణలను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనలను కట్టడి చేసేందుకు గురువారం రాజధానిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రయుత్ ప్రభుత్వం. భారీగా గుమిగూడటం, ఐదుగురికి మించి ఒక్కచోట చేరడంపైనా నిషేధం విధించింది.
రాజీనామాకు నో
ప్రధాని పదవికి రాజీనామా చేయనని ప్రయుత్ స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కాబట్టి రాజీనామా చేసే ఆలోచనే లేదని అన్నారు. పరిస్థితి మెరుగుపడితే 30 రోజుల గడువుకు ముందే అత్యయిక పరిస్థితిని తొలగిస్తామని ప్రకటించారు.
అదే సమయంలో, విద్యార్థుల నిరసనలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బ్యాంకాక్‌లోని ప్రధాన కేంద్రాల్లో నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసింది పోలీసు విభాగం. రహదారులకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సమీపంలోని ప్రజా రవాణా స్టేషన్లను మూసివేశారు. పోలీసుల భద్రత చర్యలతో పాటు భారీగా కురిసిన వర్షాల కారణంగా తక్కువ సంఖ్యలోనే నిరసనకారులు బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గురువారం దాదాపు 10 వేల మంది నిరసనల్లో పాల్గొన్నారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మరో ఇద్దరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 51 మందిని అరెస్టు చేసినట్లు థాయ్‌లాండ్ అధికారులు తెలిపారు.