ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఓ ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని 11వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సులకు.. ఉగ్రవాదం అనేది అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు.
"కొన్ని అంచనాల ప్రకారం, ఉగ్రవాదం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవృద్ధి 1.5 శాతం తగ్గింది. ఫలితంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఉగ్రవాదంతో..లక్షల ప్రాణాలు పోయాయ్..
గత పదేళ్లలో ఉగ్రవాదం బారినపడి 2.25 లక్షల ప్రాణాలు పోయాయని... ఫలితంగా కొన్ని సమాజాలు పూర్తిగా నాశనం అయ్యాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
కలిసికట్టుగా..
ఉగ్రవాదం, తీవ్రవాదానికి ఆర్థికసాయం, మాదక ద్రవ్యాల రవాణా, వ్యవస్థీకృత నేరాలు సృష్టించిన సందేహాస్పద వాతావరణం వల్ల పరోక్షంగా అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్యానికి భారీ నష్టం చేకూరిందని మోదీ అన్నారు. ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు మొదటిసారిగా సెమినార్ నిర్వహించినందుకు సంతోషంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు కృషిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరిదీ ఒకటే మాట
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమర్థించేది లేదని... మతం, జాతీయత, నాగరికతతో సంబంధంలేకుండా తీవ్రవాదాన్ని నేరపూరితమైన చర్యగానే భావించాలని బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరాటానికి సభ్యదేశాలు అన్ని కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశాయి.
వాణిజ్యం...
బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ సూచించారు. ప్రపంచ వాణిజ్యంతో పోల్చితే... బ్రిక్స్ దేశాల మధ్యవాణిజ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.