తెలంగాణ

telangana

ETV Bharat / international

'మీరు ఎక్కడున్నా మాతృభూమిని మరవొద్దు' - Telugu Association of Dubai

nv ramana felicitates: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సదస్సులో పాల్గొనడానికి దుబాయ్‌కి వెళ్లిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను ఆదివారం అక్కడి తెలుగు అసోసియేషన్‌ గౌరవపూర్వకంగా సన్మానించింది. భారతీయులు ఎక్కడున్నా మాతృభాష, మాతృమూర్తి, స్వగ్రామాలను మరవొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. మొగ్గగా మొదలైన ఈ సంస్థ మహావృక్షంగా విస్తరించి తెలుగు జాతికి, భాషకు, సంస్కృతికి ఈ దుబాయ్‌ ప్రాంతంలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

justice nv ramana
జస్టిస్ ఎన్​.వి.రమణ

By

Published : Mar 21, 2022, 8:11 AM IST

Updated : Mar 21, 2022, 8:19 AM IST

cji nv ramana felicitates: "భారతీయులకు సహజంగానే క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీ, అంకిత భావాలుంటాయి. అయితే దురదృష్టవశాత్తూ జాతి, మతానికి సంబంధించిన సంకుచిత మనస్తత్వ ధోరణి వల్ల భారతదేశం అనుకున్నంత అభివృద్ధి సాధించలేదన్న బాధ ఉంది. అలాంటి సంకుచితత్వాన్ని వదిలి.. మనమంతా ఒక్కటే అన్న దృక్పథంతో కృషిచేస్తే అభివృద్ధితో పాటు గౌరవం పెరుగుతుంది" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సదస్సులో పాల్గొనడానికి దుబాయ్‌కి వెళ్లిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణను ఆదివారం అక్కడి తెలుగు అసోసియేషన్‌ గౌరవపూర్వకంగా సన్మానించింది. నిర్వాహకులు జస్టిస్‌ ఎన్‌.వి రమణ, ఆయన సతీమణి శివమాలను గజమాలతో గౌరవించి, శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ వారిని ఉద్దేశించి మాట్లాడారు. "మీరు ఎక్కడున్నా మాతృభాష, మాతృమూర్తి, స్వగ్రామాలను మరవొద్దు. మీ మూలాలు ఇంకా భారతదేశంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడల్లా సొంతూళ్లకు వెళ్లాలి. వాటి అభివృద్ధికి చేయూత నివ్వాలి. యూఏఈలో ఉన్న తెలుగువారంతా అన్యోన్యంగా ఉంటూ సహకరించుకోవాలి" అని పిలుపునిచ్చారు.

భారతీయులను చూసి గర్విస్తున్నా..

"సొంత దేశం, రాష్ట్రం, గ్రామాలను వదిలి పెట్టి వేల మైళ్ల దూరం వచ్చి.. కష్టనష్టాలకోర్చి మీ భవిష్యత్తును నిర్మించుకుంటూనే, ఈ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సుందర నిర్మాణానికి కారకులైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 8 రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు తెలుగువారు పెద్దసంఖ్యలో కనిపించారు. ఆప్యాయత, అనుబంధంతో దగ్గరకొచ్చి పలుకరిస్తుంటే ఎంతో సంతోషించాను. ఇక్కడ పలువురు ప్రముఖులతో మాట్లాడినప్పుడు భారతీయుల పట్ల వారికున్న అభిప్రాయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక్కడ భారతీయుల నిజాయతీ, కష్టించి పనిచేసేతత్వాన్ని చూసి ఎంతో గర్వంగా ఉందని వారు చెప్పినప్పుడు నేను ఉప్పాంగిపోయాను. మూడు రోజుల క్రితం యూఏఈ న్యాయశాఖమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలిసి ఇక్కడి ప్రవాస భారతీయుల కష్టాల గురించి దాదాపు రెండు గంటలు చర్చించాను. అప్పుడు వాళ్లు ఈ దేశ నిర్మాణంలో భారతీయుల పాత్ర.. ముఖ్యంగా దక్షిణాది వాసుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. భారతీయుల్లో నేర స్వభావం చాలా తక్కువని, శాంతిభద్రతల సమస్యల్లాంటివి ఎప్పుడూ సృష్టించకుండా తమ పనులను తాము క్రమశిక్షణతో చేసుకుపోయే జాతి అని ప్రశంసించారు. ఆ ప్రశంస నా కుటుంబ సభ్యులు, పిల్లలకు దక్కినంత ఆనందం కలిగింది. ఒక కుటుంబ పెద్దగా అంతకుమించి కోరుకొనేది ఏమీ ఉండదు. 'ఏదేశమేగినా.. ఎందుకాలిడినా'.. అంటూ రాయప్రోలు సుబ్బారావు ఆనాడు మీలాంటి అంకితభావం కలవారిని చూసే రాసి ఉంటారు" అని సీజేఐ అన్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు అసోసియేషన్‌ పనితీరును ఆయన కొనియాడారు. "మొగ్గగా మొదలైన ఈ సంస్థ మహావృక్షంగా విస్తరించి తెలుగు జాతికి, భాషకు, సంస్కృతికి ఈ దుబాయ్‌ ప్రాంతంలో మంచి గుర్తింపు తీసుకురావాలి" అని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:'స్వతంత్రంగా భారత న్యాయవ్యవస్థ.. ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలం'

Last Updated : Mar 21, 2022, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details