ఎవరూ ఊహించని వేగంతో అప్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా దళాలతో శిక్షణ తీసుకున్న అప్గాన్ సైనికులు పెద్దగా ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. కొందరు సైనికులైతే వీరిని చూసి పారిపోయారు. తాలిబన్లు ఇంత త్వరగా కాబుల్‌లోకి ప్రవేశించి అధికారం చేజిక్కించుకోవడానికి ఓ ప్రత్యేక దళమే కారణం. ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టగల సామర్థ్యం దీని సొంతం.
ఎరుపు దళం..
అఫ్గాన్‌లో తాలిబన్లు, సైన్యం మధ్య యుద్ధాన్ని క్షేత్రస్థాయిలో వీక్షించిన స్థానికులు ఈ ప్రత్యేక దళం గురించి వివరించారు. పాష్టో బాషలో 'సర ఖేత'గా పిలిచే ఈ దళాన్ని 'రెడ్ యూనిట్' అంటారు.
తాలిబన్లు ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా పెట్టుకుంటే.. ముందుగా అక్కడికి ఈ ఎరుపు దళం వెళుతుంది. శత్రువుల్లో కీలకమైన వ్యక్తులను చాకచక్యంగా మట్టుబెడుతుంది. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిన తర్వాత తాలిబన్ల సైన్యం అక్కడకు వెళ్లి ఆ ప్రదేశాన్ని తమ హస్తగతం చేసుకుంటుంది.
ప్రత్యేక వేషధారణ
ఈ ఎరుపు సైన్యం వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తలకు ఎరుపు రంగు బ్యాండ్, కాళ్లకు పాకిస్థాన్‌లో తయారు చేసిన చీతా స్నీకర్లు, ఎల్బో గార్డులు, మోకాలి ప్యాడ్లు, ప్రత్యేక గ్లోవ్‌లు, చాతి కవచం ధరిస్తారు. మిలటరీకి మించి కఠోర శిక్షణ తీసుకుంటారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు, రైఫిళ్లు ఉంటాయి. యుద్ధవిమానాలను నిర్వీర్యం చేయగల తుపాకులుంటాయి. అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్లు, తేలికపాటి మెషీన్ గన్లు సహా మిలటరీలో ఉపయోగించే ఆయుధాలన్నీ వీరికి తాలిబన్లు సమకూర్చుతారు. రాత్రివేళలో స్పష్టంగా చూడగలిగే సాధానాలు, లేజర్ పాయింటర్లు కూడా వీరి వద్ద ఉంటాయి. అంతేగాకుండా వీరు అఫ్గాన్ యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి.. వారు తాలిబన్లతో కలిసి పోరాడేలా చేస్తారు.