అఫ్గానిస్థాన్‌లో(Afghan News) తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. షరియా చట్టానికి(sharia rules) అనుగుణంగా పరిపాలిస్తామని తేల్చి చెప్పారు. అయితే.. ఇప్పుడు వీరి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా? లేదా? అన్నది అసలైన ప్రశ్న. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వంపై వివిధ దేశాల వైఖరి ఎలా ఉందంటే..?
చైనా సంగతేంటి?
అమెరికా వైదొలిగిన అనంతరం అఫ్గాన్‌పై పట్టు సాధించేందుకు చైనా(China on Afghanistan) విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడి ఖనిజాలపై కన్నేసిన చైనా.. తాలిబన్లతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ క్రమంలో అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై చైనా బుధవారం స్పందించింది. కొన్ని వారాలుగా సాగుతున్న అనిశ్చితికి తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టడం వల్ల ముగింపు దొరికిందని అభిప్రాయపడింది.
"తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరమైన చర్య. మూడు వారాలుగా అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చితికి తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల తెరపడింది. విస్తృతమైన రాజకీయ విధానాల్ని తాలిబన్లు పాటించాలని కోరుకుంటున్నాం. స్నేహపూరిత విదేశాంగ విధానాలను వారు అవలంబిస్తున్నారని ఆశిస్తున్నాం."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ మంత్రి.
పాక్ వైఖరేంటి?
తాలిబన్లను వెనక నుంచి నడిపించి, వారు అధికారాన్ని చేజిక్కించుకునేలా పాకిస్థానే(Pakistan on Afghanistan) సాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాలిబన్ల ప్రభుత్వంపై పాకిస్థాన్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్నది కీలకంగా మారింది. అయితే.. అఫ్గాన్ పరిస్థితులపై చర్చించడానికి పొరుగు దేశాలతో పాకిస్థాన్ బుధవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. చైనా, ఇరాన్, తజికిస్థాన్, తుర్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్చువల్ భేటీకి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అధ్యక్షత వహించారు.
సుదీర్ఘ యుద్ధాన్ని చవిచూసిన అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయని ఖురేషీ తెలిపారు. అయితే.. తాలిబన్లపై గతంలో ఏర్పరుచుకున్న అభిప్రాయాలను వీడి, నూతన వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"మానవతా సంక్షోభాన్ని అడ్డుకుని, అఫ్గాన్‌ను ఆర్థికపరంగా అఫ్గాన్‌ను గట్టెక్కించడమే ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ దిశగా అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు భేటీలో పాల్గొన్న దేశాలు అంగీకరించాయి" అని ఖురేషీ పేర్కొన్నారు.
అమెరికా ఏమంటోంది?
తాలిబన్ల ప్రభుత్వం కదలికల్ని తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. తాలిబన్ల చర్యల ఆధారంగా వారి ప్రభుత్వాన్ని గుర్తించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.