తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రజా పాలనకు అంతం- తాలిబన్ల కబంధ హస్తాల్లోకి అఫ్గాన్​! - అఫ్గానిస్థాన్

ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్‌లు అఫ్గానిస్థాన్​లో అధికారాన్ని అందుకున్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పవనాలను ఆస్వాదించిన అఫ్గాన్‌ ప్రజలకు తాజాగా మళ్లీ తాలిబన్ల పాలన రావడం అంతులేని విషాదాన్ని కలిగించింది.

talibans in afghanistan
అఫ్గాన్​లో తాలిబన్లు

By

Published : Aug 15, 2021, 7:00 PM IST

అనుకున్నదంతా అయ్యింది.. అయితే ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్‌లు అఫ్గాన్‌లో అధికారాన్ని అందుకోవడం గమనార్హం. అఫ్గాన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. యావత్‌ ప్రపంచం తమకు అండగా ఉంటుందని ఆశించిన అఫ్గాన్‌ సామాన్యులకు నిరాశే మిగిలింది. మళ్లీ తాలిబన్ల రాక్షస పాలనలోకి వెళ్లనున్నామనే ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సామగ్రిని అమెరికా అఫ్గాన్‌ దళాలకు అప్పగించింది. శిక్షణ ఇచ్చింది. అయినా తాలిబన్లతో ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోవడం ఆశ్చర్యమే.

ఏం జరిగింది..

2001 సెప్టెంబరు ఉగ్రవాద దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్‌ జూనియర్‌ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌పై దాడులు జరిగాయి. ఆ దేశ దక్షిణ భాగంలో ఫస్తూన్‌లు ఎక్కువ. అయితే ఉత్తర భాగంలో తజక్‌లు, ఉజ్బెక్‌లు, హజిరాలు ఉంటారు. వీరి సారథ్యంలో ఉత్తరకూటమి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. గగనమార్గాన నాటో దళాలు దాడులు జరుపుతుంటే భూమార్గంలో ఉత్తరకూటమి తాలిబన్లపై విరుచుకుపడింది. అనంతరం తాలిబన్లు పారిపోవడం, అమెరికా అండతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పవనాలను ఆస్వాదించిన అఫ్గాన్‌ ప్రజలకు తాజాగా మళ్లీ తాలిబన్ల పాలన రావడం అంతులేని విషాదాన్ని కలిగించింది.

బైడెన్‌ నిర్ణయమే మార్చింది..

అఫ్గాన్‌ నుంచి తమ దళాలను సెప్టెంబరు 11 కల్లా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించడంతో తాలిబన్లలో ఉత్సాహం ప్రారంభమైంది. అఫ్గాన్‌ సైనిక బలగాల సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే తాలిబన్ల సంఖ్య 75 వేలకు కూడా మించదు. కానీ అఫ్గాన్‌ సైన్యం మానసికస్థైర్యం దెబ్బతినేలా అమెరికా సేనలు త్వరితగతిన వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి. దీంతో అఫ్గాన్‌ సేనల బలం లక్షల్లో ఉండటంతో పాటు తాము ఇచ్చిన శిక్షణ, ఆధునిక ఆయుధాలు తాలిబన్లను నిలువరిస్తాయని బైడెన్‌ వేసిన అంచనా తారుమారైంది. అనేక ప్రాంతాల్లో అఫ్గాన్‌ సేనలు కనీసం ఒక్క తూటా కూడా కాల్చకుండా నేరుగా తాలిబన్ల ముందు సాగిలపడ్డాయి.

ఒక జిల్లా తర్వాత ఒక జిల్లా..

ఉత్తర్‌ కుందుజ్‌నే తీసుకుంటే దాదాపు రెండు నెలలపాటు తాలిబన్‌లు దిగ్బంధించారు. అఫ్గాన్‌ సేనలకు వచ్చే ఆహార, మందుగుండు సామగ్రి సరఫరాలను అడ్డుకున్నారు. దీంతో అఫ్గాన్‌ సేనలు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయాయి. మరి కొందరు ఆయుధాలను పారవేసి పారిపోయారు. గేటులోకి తాలిబన్లు వచ్చినా ఎలాంటి ప్రతిఘటన లేకుండా సైన్యం తిరుగుముఖం పట్టింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని అఫ్గాన్‌ సైనికాధికారి పేర్కొనడం గమనార్హం.

ఏరీ.. ఆనాటి యోధులు..

అప్పట్లో తాలిబన్‌లను ఓడించిన వారిలో ఉత్తరకూటమి కీలకపాత్ర పోషించింది. అయితే అప్పటి యోధులు వయసు మీద పడటంతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. యువత ఏనాడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించలేదు. దేశంలో సాధారణ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని విశ్వసించారు. దేశంలో ఎక్కువమంది యువత. 2001 తరువాత జన్మించిన వారే. వారికి తాలిబన్ల పాలన గురించి తెలియదు. సాధారణ పరిస్థితులు ఉండటంతో యువత ఏనాడూ ఆయుధ శిక్షణ గురించి ఆలోచించలేదు. ప్రభుత్వమూ ఇలాంటి పరిస్థితి ఊహించలేదు.

'పాపి'స్థాన్‌తోనే తాలిబన్ల స్వైరవిహారం

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌లు గతంలో ఓడిపోయినా ఆ సంస్థను చురుకుగా ఉంచడంలో పాకిస్థాన్‌దే కీలక భూమిక. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో వీరికి ఆయుధాలతో పాటు శిక్షణ 2001 నుంచి ఇప్పటివరకూ కొనసాగింది. పాక్‌కు చెందిన వేలాది ఉగ్రవాదులు అఫ్గాన్‌ పౌరప్రభుత్వంపై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. దీంతో వారికి ఎదురులేకుండాపోయింది.

తన నిర్ణయం సరైనదేనన్న బైడెన్‌

బుష్‌ హయాములో అఫ్గాన్‌పై సైనికదాడులు చేపట్టినప్పుడు కేవలం తాలిబన్లను అధికారం నుంచి దించివేయడంపైనే అమెరికా దృష్టిపెట్టింది. అనంతరం విధానాన్ని మార్చుకొని ఆ దేశ పునర్‌ నిర్మాణం చేపట్టింది. లక్షల కోట్ల డాలర్లను ఆ దేశంలో ఖర్చుపెట్టింది. ఇది ఆర్థికంగా అమెరికాకు నష్టమే. అఫ్గాన్‌లో ఎలాంటి సహజవనరులు లేవు. వీటి ద్వారా అమెరికాకు ఎలాంటి ఆదాయమూ లేదు. అఫ్గాన్‌ నుంచి అమెరికా వెనక్కు మళ్లాలని పలువురు డిమాండ్ చేశారు. బుష్‌ జూనియర్‌, ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌లు అఫ్గాన్‌ వ్యవహారాలను పర్యవేక్షించారు. తాలిబన్లకు పాక్‌తో పాటు చైనా , రష్యాలు ఆయుధాలను సరఫరా చేశాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఆర్థికంగా ఎలాంటి లాభదాయకం లేకపోవడంతో అమెరికా చివరకు తప్పుకుంది. ఫలితంగా తాలిబన్లు అవలీలగా దేశాన్ని తిరిగి తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details