అఫ్గానిస్థాన్ రక్తమోడుతోంది. 'దోహా' ఒప్పందం ప్రకారం అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ కొనసాగుతున్న వేళ.. తాలిబన్ల అరాచకం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారి ఆక్రమణ విస్తరించడం కలవరపెడుతోంది. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్ ప్రాంతాన్ని ఆక్రమించడం తాలిబన్లు ఎంత వేగంగా పుంజుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
బలగాల ఉపసంహరణతో విధ్వంసం..
గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన 2500 మంది సైనికులు, నాటో కూటమికి చెందిన 7 వేల మంది సైనికులు అఫ్గాన్ నుంచి వెనక్కి వెళ్లాలి. బైడెన్ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 8 నాటికి సగం బలగాలను అమెరికా వెనక్కి రప్పించింది. అయితే బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. సాధారణ పౌరులతోపాటు, పాత్రికేయులు, మహిళా కార్యకర్తలు, మానవహక్కుల పరిరక్షణ కార్యకర్తలపై తాలిబన్ల దాడులు పెరిగాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువతులు, అమాయకులైన పౌరులపై తాలిబన్ల దాడులు పెరిగిపోయాయి.
రెండున్నర రెట్ల మరణాలు..