అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్నీ అనుమతించబోమని తాలిబన్లు(taliban news) స్పష్టం చేశారు. తాలిబన్ అధినేతను పాకిస్థాన్ ఐఎస్‌ఐ చీఫ్ కలిశారన్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే, అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్ ప్రధాన పాత్ర పోషిస్తోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాలిబన్లు ఈ విధంగా స్పందించారు.
తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెన్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ హమీద్ అఫ్గానిస్థాన్ వెళ్లారనే వార్తలు వచ్చాయి. అక్కడ అఫ్గాన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్ కలిసినట్లు తెలిసింది. తాజాగా దీనిపై స్పందించిన తాలిబన్లు.. బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్ కలిసిన మాట వాస్తవమేనన్నారు. కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగానే పాక్ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే, తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఓ అత్యున్నత ర్యాంకు అధికారి వారితో కలవడం అదే తొలిసారి.