అఫ్గానిస్థాన్‌ను వశపరుచుకున్న తాలిబన్లు.. మూడు రోజుల్లోనే తమ తుపాకులకు పని చెప్పడం ప్రారంభించారు. సమ్మిళిత, బహిరంగ ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు, పాలనలో మహిళలకు చోటు, తమకు వ్యతిరేకంగా పని చేసిన వారు సహా ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామంటూ పలికిన బీరాలు అంతా ఒట్టిదేనని తాలిబన్లు నిరూపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం సాగించిన అరాచక పాలనకు మళ్లీ నాందీ ప్రస్తావన అంటూ తమ పాత నైజాన్ని చాటుకుంటున్నారు.
కాల్పుల్లో ముగ్గురు మృతి..
అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, కీలక శాంతిదూత అబ్దుల్లా అబ్దుల్లాతో తాలిబన్లు చర్చలు జరపగా అదే సమయంలో ముష్కరులకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగాయి. పలు చోట్ల మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అయితే నిండా కర్కషత్వం నింపుకొన్న తాలిబన్లు ఈ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు తాలిబన్ల జెండా తొలగించి, తమ జాతీయ జెండాను ఎగురవేయగా.. వారిపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
అలీ మజారీ విగ్రహం ధ్వంసం
నిరసనకారులను.. మోకాళ్లపై కూర్చోబెట్టి తుపాకులు ఎక్కుపెడుతున్నారు. ఇక గత పౌర ప్రభుత్వంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారికి ఏ హానీ తలపెట్టబోమని ఇచ్చిన హామీని పూర్తిగా గాలికొదిలారు. వారి కోసం ఇల్లిల్లూ గాలిస్తున్నారు. 1990వ సంవత్సరంలో జరిగిన అఫ్గాన్ పౌర యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన షియా మిలీషియా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. 1996లో తాలిబన్‌లు మజారీని హత్య చేశారు. బామ్‌యాన్‌లో 15 వందల ఏళ్ల నాటి బుద్ధ విగ్రహాన్ని.. తాలిబన్లు పేల్చివేశారు.
ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని..