అమెరికాపై ఉన్న అక్కసును చైనా(China On America) మరోసారి వెళ్లగక్కింది. అమెరికా దళాలు(American Troops In Afghanistan) అఫ్గానిస్థాన్‌లో ఇప్పటివరకు మారణహోమం సృష్టించినట్లు పేర్కొంది. చైనా విదేశాంగ శాఖకు చెందిన అధికారి లిజైన్ ఝాఓ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అఫ్గాన్‌లో అమెరికాకు చెందిన పాడైపోయిన యుద్ధ విమానాలు అందులో కనిపిస్తున్నాయి. అందులోని ఓ విమానం రెక్కకు తాలిబన్లు(Afghanistan Taliban) తాడుకట్టి ఊయల ఊగుతున్నారు. ఈ వీడియోను పంచుకున్న లిజైన్ ఝాఓ.. అమెరికాను ఉద్దేశిస్తూ 'ఇది పాలకుల కాలం నాటి శ్మశానవాటిక. వారి యుద్ధ విమానాలు. ఆ విమానాలను తాలిబన్లు ఊయలలా, ఆట వస్తువుల్లా మార్చుకున్నారు' అంటూ ఎద్దేవా చేశారు. ఆ ప్రాంతం.. అఫ్గాన్‌లో సేవలందించే సమయంలో అమెరికా బలగాల స్థావరంగా తెలుస్తోంది.
వారి చేతికి చిక్కకుండా..
అఫ్గాన్‌లో 20ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముగించుకున్న అమెరికా.. ఆగస్టు 30 నాటికి అక్కడి నుంచి తమ బలగాలను(American Troops In Afghanistan) ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న తరలింపు ప్రక్రియ మొదలైన నాటి నుంచి దాదాపు ఆరువేల మంది అమెరికా సైనికులు తిరిగి వారి దేశం వెళ్లిపోయారు. వారు ఉపయోగించిన సాయుధ వాహనాలను వెళ్లేముందు పనికిరాకుండా చేశారు. వీటి ధర ఒక్కోటి 1 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా వాటిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు.