అఫ్గాన్ రాజకీయాల్లో ఉత్కంఠ వీడనుంది! మరో మూడు రోజుల్లో అక్కడ తాలిబన్ సర్కారు(Taliban Rule in Afghanistan) కొలువుదీరనుంది. ఆ దేశ సుప్రీం లీడర్‌గా ఇస్లాం మతపెద్ద ముల్లా హిబతుల్లా అఖుంద్ జాదా(Hibatullah Akhundzada) వ్యవహరించనున్నారు. తాలిబన్ ఉద్యమానికి(Afghanistan Taliban) పుట్టిల్లయిన కాందహార్ నుంచి ఆయన కార్యకలాపాలు సాగిస్తారు. కొత్త ప్రభుత్వం ఇరాన్ నాయకత్వాన్ని పోలి ఉంటుందని సమాచారం. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ఇప్పటికే సన్నద్ధమైనట్టు ఆ సంస్థ సీనియర్ నాయకుడు ముఫ్తీ ఇనముల్లా సమంగనీ గురువారం వెల్లడించారు. సంప్రదింపులన్నీ కొలిక్కి వచ్చాయని, కేబినెట్ ఏర్పాటుపై చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. నూతన ప్రభుత్వ విధానం, జాతీయ జెండా, జాతీయ గీతంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
అఫ్గాన్‌లోని రాష్ట్రాలు (ప్రావిన్స్‌లు) గవర్నర్ల నియంత్రణలో ఉంటాయి. జిల్లాలకు డిస్ట్రిక్ట్ గవర్నర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. తాలిబన్ సంస్థ ఇప్పటికే గవర్నర్లు, పోలీసు విభాగాధిపతులతో పాటు.. ప్రావిన్స్, జిల్లా కమాండర్ల నియామకం చేపట్టింది. కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాల మహిళలకు ప్రాతినిధ్యం ఉంటుందని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ డిప్యూటీ లీడర్ షేర్ మహమ్మద్ అబ్బాస్ గురువారం వెల్లడించారు.