అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న ముష్కరులు కాబుల్‌కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని, మూడో అతిపెద్ద నగరమైన హేరత్ను హస్తగతం చేసుకున్నారు. ఆక్రమణ అనంతరం నగరంలో తమ జెండాలను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను తాలిబన్లే స్వయంగా పోస్ట్ చేశారు. ఘాజ్నీతో కలిపి మొత్తం 11 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయాయి.
నగరం వెలుపల ముష్కరులకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాబుల్ నగరానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. తాలిబన్ల దురాక్రమణ ఇంత వేగంగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానితో పాటు మిగిలిన కొన్ని నగరాలను కాపాడుకునేందుకే సర్కారు పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఘాజ్నీ నగరాన్ని తాలిబన్లకు కోల్పోవడం.. అఫ్గాన్ సేనలకు వ్యూహాత్మక ఎదురుదెబ్బే అని తెలుస్తోంది. కాబుల్- కాందహార్ హైవే మధ్య ఉన్న ఈ నగరం.. అఫ్గాన్ రాజధానిని, ఆ దేశ దక్షిణాది రాష్ట్రాలను కలుపుతుంది. ఈ నగరం ఆక్రమణతో.. అఫ్గాన్ సైనికుల రవాణా కష్టతరం కానుంది. అదే సమయంలో, దక్షిణాది నుంచి అఫ్గాన్ భూభాగాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు తాలిబన్లకు ఇదో మంచి అవకాశంగా మారనుంది.
హెలికాప్టర్ సీజ్
మరోవైపు, అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించిన ఎం-35 హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందుజ్ ఎయిర్‌బేస్‌లో ఈ హెలికాప్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. చాపర్ రోటర్లను తొలగించినట్లు తెలుస్తోంది. సీరియల్ నెంబర్‌ను బట్టి ఇది భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టరేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.