అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. రాజధాని కాబుల్‌కు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని తాలిబన్లు పూర్తిగా ఆక్రమించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం తాలిబన్లు కాబుల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వివరించారు. కాబుల్‌కు ఉత్తరాన ఉన్న మజార్-ఏ-షరీఫ్ ప్రాంతంపై.. అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నట్లు వెల్లడించారు.
మజార్-ఏ-షరీఫ్‌లో బుధవారం పర్యటించిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. అక్కడి కమాండర్లతో సమావేశమై భద్రతపై చర్చించారు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా ఉపసంహరించక ముందే చాలా ప్రాంతాలను తాలిబన్లు వశపరుచుకున్నారు.
రేడియో స్టేషన్ ఆక్రమణ..
కాందహార్‌లోని రేడియో స్టేషన్‌ను ఆక్రమించినట్లు తెలిపిన తాలిబన్లు.. అందులో కేవలం ఇస్లామిక్‌కు సంబంధించిన వార్తలే ప్రసారమవుతాయని వీడియో విడుదల చేశారు.
ఇదీ చదవండి:తాలిబన్ల ఉక్కుపిడికిట్లో అఫ్గాన్- రష్యా, చైనా మద్దతు!
బైడెన్ ఫోన్..
అధికారులతో మాట్లాడిన బైడెన్ తమ దేశ సిబ్బందిని అఫ్గానిస్థాన్ నుంచి తరలించే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్‌తో మాట్లాడారు.
ఐరాస ఆవేదన..
ఆవేదన వ్యక్తం చేసిన గుటెరస్ తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
"అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే ఈ తరహా ఘర్షణలను చవిచూసిన దేశం మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది. ఇది అక్కడి ప్రజలకు తీరని విషాదం. అఫ్గాన్ వాసుల ప్రయోజనాల కోసం తాలిబన్లు వెంటనే ఈ దాడుల్ని నిలిపివేయాలి. విశ్వాసంతో చర్చలు జరపాలి. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సరైన మార్గం కాదు. అది సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. అఫ్గాన్‌ను ఒంటరిని చేస్తుంది. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తోన్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి" అని పిలుపునిచ్చారు గుటెరస్.
ఇదీ చదవండి:భారత్‌ను పొగుడుతూనే.. మోదీ సర్కార్‌కు తాలిబన్ల హెచ్చరిక