అఫ్గానిస్థాన్‌లో(afghanistan taliban) పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా(Afghan crisis) మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు(Taliban).. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమపై పోరాటంలో అమెరికా నేతృత్వంలోని బలగాలకు, అఫ్గాన్ ప్రభుత్వానికి సహకరించిన కీలక వ్యక్తుల గురించి వారు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. జర్మనీకి చెందిన వార్తాసంస్థలో పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కోసం వెతుకుతూ.. ఆయన సమీప బంధువును తాలిబన్లు పొట్టనపెట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. హజారా మైనారిటీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని గత నెల్లో వారు క్రూరంగా చంపేసిన సంగతి కూడా తాజాగా బయటపడింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించి వారం రోజులు కూడా కాకముందే.. విధులకు హాజరు కాకుండా వారిని తాలిబన్లు అడ్డుకుంటుండటమూ పలు అనుమానాలకు తావిస్తోంది.
హజారాలపై మళ్లీ ఉక్కుపాదం
మానవ హక్కుల కోసం పోరాడే 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' సంస్థ.. తాలిబన్ల క్రూరత్వానికి సంబంధించి తాజాగా కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సంస్థ కథనం ప్రకారం.. అఫ్గాన్‌లో గజనీ ప్రావిన్సులోని ముందరఖ్త్ గ్రామంలో తాలిబన్లు గత నెల 4-6 తేదీల మధ్య విధ్వంసం సృష్టించారు. హజారా వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తొమ్మిది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. వారిలో ఆరుగుర్ని కాల్చిచంపగా, మిగతా ముగ్గుర్ని చిత్రవధ చేసి చంపేశారు. వాస్తవానికి హత్యల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఒకప్పటి తాలిబన్ల అరాచక పాలనను ఈ హత్యలు గుర్తుచేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాలమర్డ్ పేర్కొన్నారు. హజారాలు షియా ముస్లింలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు.
జర్నలిస్టు బంధువులపై దాడి
మీడియా స్వేచ్ఛను హరించబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు ఆ మాట కూడా తప్పారు. జర్మనీకి చెందిన 'డాట్షె విల్లె' వార్తాసంస్థలో సంపాదకుడిగా ఉన్న ఓ వ్యక్తి కోసం అఫ్గాన్‌లో వారు కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సదరు జర్నలిస్టు బంధువులపై దాడి చేశారు. వారిలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లు వెతుకుతున్న జర్నలిస్టు ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు సమాచారం. తాజా హత్యను డాట్షె విల్లె డైరెక్టర్ జనరల్ పీటర్ లింబర్గ్ ఖండించారు. తమ సంస్థకు చెందిన మరో ముగ్గురు జర్నలిస్టుల కోసం కూడా తాలిబన్లు వెతుకుతున్నట్లు సమాచారముందని చెప్పారు. మరోవైపు- గత అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులతో పాటు అమెరికా నేతృత్వంలోని విదేశీ బలగాలకు సహకారం అందించినవారి పేర్లతో తాలిబన్లు బ్లాక్‌లిస్ట్‌ను తయారుచేసుకున్నారని నార్వేకు చెందిన 'రిప్టో నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ అనలైసెస్' ఓ నివేదికలో వెల్లడించింది. వారికోసం అన్వేషిస్తున్నారని తెలిపింది. జాబితాలోని పలువురికి.. తాలిబన్ మిలటరీ కమిషన్ పేరిట ఇప్పటికే బెదిరింపు లేఖలు కూడా పంపారని పేర్కొంది.
మహిళల విధులకు అడ్డగింత
మహిళల హక్కులను పరిరక్షిస్తామన్న మాటనూ తాలిబన్లు నిలబెట్టుకోవడం లేదు. తాను కార్యాలయంలోకి వెళ్లకుండా తాలిబన్లు నిలువరించారని రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ యాంకర్ షబ్నమ్‌ఖాన్ దవ్రాన్ తాజాగా వెల్లడించారు. తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని మరో మహిళా జర్నలిస్టు ఖదీజా తెలిపారు.
విమానాశ్రయానికి వేలమంది..
కాబుల్ విమానాశ్రయానికి శుక్రవారం కూడా వేలమంది పోటెత్తారు. వాస్తవానికి నగరవ్యాప్తంగా తాలిబన్లు చెక్‌పాయింట్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అఫ్గానీలు విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దొరికినవారిని చితకబాదిమరీ వెనక్కి పంపుతున్నారు. ఎలాగోలా ముష్కరుల కళ్లుగప్పి, అతికష్టమ్మీద జనం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
ఐక్యతకు పిలుపునిచ్చిన ఇమామ్‌లు