ముష్కర చెరలో చిక్కిన అఫ్గానిస్థాన్‌లో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. యావత్ దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. స్త్రీలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటూ తమ సహజ స్వభావానికి విరుద్ధంగా పిలుపునిచ్చారు. మంగళవారం కూడా ఎక్కడా విధ్వంసాలకు తెగబడకుండా శాంతిమంత్రం జపించారు. అయితే వారి మాటలు ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం నింపడం లేదు. త్వరలోనే వారి నిజస్వరూపాన్ని బయటపెట్టి, ఒకప్పటి అరాచక పాలనను మళ్లీ తీసుకొస్తారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి అఫ్గాన్‌కు సహాయక నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే ముష్కరులు మితవాదులుగా నటిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- కాబుల్ నుంచి పలువురు అఫ్గానీలను అమెరికా తమ విమానాల్లో కతర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అగ్రరాజ్యానికి చెందిన ఓ విమానమెక్కిన 640 మంది అఫ్గాన్ పౌరులు కతార్‌లో దిగిపోయారు. అఫ్గాన్‌లో తాలిబన్ సర్కారు 1-2 రోజుల్లో ఏర్పడే అవకాశముందని, తాలిబనేతర నేతలకూ అందులో చోటుదక్కుతుందని వార్తలొస్తున్నాయి.
తాలిబన్ల పడగ నీడలో అఫ్గాన్ రాజధాని కాబుల్‌లో మంగళవారం గంభీర వాతావరణం కనిపించింది. నగర వీధుల్లో ముష్కరులు తుపాకులు చేతపట్టుకొని గస్తీ తిరిగారు. అధిక శాతం ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది మహిళలు స్వల్ప సమయంపాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్త్రీల స్వేచ్ఛకు సంకెళ్లు విధించొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రెండు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న హక్కులన్నీ ఇకపై అందని ద్రాక్షే అవుతాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా మహిళల్లో కనిపిస్తోంది. మరోవైపు- కాబుల్‌లోని పలు పార్కులు, వ్యాయామశాలల్లో చిన్నపిల్లల తరహాలో కేరింతలు కొడుతూ తాలిబన్లు సరదాగా గడుపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ
స్త్రీల హక్కులను పూర్తిగా కాలరాసేవారిగా పేరున్న తాలిబన్లు తాజాగా ఓ మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు వార్తాసంస్థకు చెందిన మహిళా టీవీ యాంకర్‌తో వారు ముఖాముఖి మాట్లాడారు. ఒకప్పటి తాలిబన్ సర్కారు అరాచక పాలనలోనైతే ఊహకైనా అందని విషయమది. తాము మారిపోయామని.. పాలనలో ఒకప్పటిలా క్రూర విధానాలను అనుసరించబోమని ప్రజలకు తెలియజెప్పేందుకు తాలిబన్లు ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
విమానాశ్రయం వద్ద గాల్లోకి కాల్పులు
దేశం విడిచి వెళ్లేందుకు ప్రజలు పోటెత్తడంతో సోమవారం జనసంద్రాన్ని తలపించిన కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పరిస్థితులు మంగళవారం కొంత మెరుగుపడ్డాయి. అమెరికా బలగాల పహారాలో అక్కడి నుంచి మిలటరీ తరలింపు విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కాబుల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని ఇప్పటికే ఖాళీ చేసిన అమెరికా.. విమానాశ్రయం నుంచే ఆ కార్యాలయపు పనులను నడిపిస్తోంది. రాత్రివేళ తాలిబన్లు విమానాశ్రయం వద్దకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ప్రజలు ప్రవేశించేందుకు నిర్దేశించిన మార్గం వద్ద వారు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడున్న దాదాపు 500 మందిని వెనక్కి పంపించేశారు.