అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష
"ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. అందువల్ల మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలి." అని తాలిబన్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
అఫ్గాన్ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ చీకటిరోజులు తప్పవని భీతిల్లుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన ఎరిగిన ప్రజలు దేశం నుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరికీ హాని తలబెట్టబోం..
కాగా.. అఫ్గాన్ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజ వైఖరికి విరుద్ధంగా శాంతి మంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి నిన్న భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.
ఇవీ చదవండి:
తుపాకులతో తాలిబన్ల గర్జన.. అఫ్గాన్‌లో రాక్షస పాలన!
తాలిబన్ల ఆక్రమణతో మళ్లీ చీకటిరాజ్యం!
హెలికాఫ్టర్ నిండా డబ్బుతో అఫ్గాన్‌ను వీడినఘనీ!