తెలంగాణ

telangana

ETV Bharat / international

ఖాళీ ఏటీఎంలు, ఆకలి కేకలు.. అయినా తాలిబన్ల వేడుకలు - అఫ్గాన్​ను ఆక్రమించిన తాలిబన్లు

ఆగస్టు 19న అఫ్గానిస్థాన్​ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు తాలిబన్లు. అమెరికా అహంకారంపై విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే పాలనపరంగా ఎన్నో సవాళ్లు వారికి స్వాగతం పలుకుతున్నాయి. ఏటీఎంలు నిండుకుపోవడం, ఆహార సంక్షోభం ఇందులో ప్రధానమైనవి.

Taliban
Taliban

By

Published : Aug 19, 2021, 2:50 PM IST

అమెరికా అహంకారంపై విజయం సాధించినట్టు తాలిబన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్​ స్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 19) వేడుకల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబన్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిధులు స్తంభింపజేయడం, ఏటీఎంలు నిండుకుపోవడం, ఆహార సంక్షోభం.. ప్రధానమైనవి. ఇప్పటికే.. తాలిబన్ల కట్టడి కోసం వారికి ఎలాంటి ఆర్థిక వనరులు అందకుండా అమెరికా సహా అంతర్జాతీయ సం‌స్థలు చర్యలు చేపట్టాయి. అమెరికా తమ దేశంలోని బ్యాంకుల్లో అఫ్గాన్​కు సంబంధించి దాదాపు 9.5 బిలియన్‌ డాలర్లు విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్‌ కూడా తాము మంజూరుచేసిన నిధులను తీసుకునే హక్కును అఫ్గానిస్థాన్‌కు నిలిపివేసింది.

ఈ సమయంలో.. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం అఫ్గాన్​ను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు, ఉద్యోగులు తిరిగి విధుల్లోకి హాజరుకావాలని తాలిబన్లు చెప్పినప్పటికీ.. ఎవరూ ముందుకొచ్చే ధైర్యం చేయడం లేదు. సరిహద్దుల గుండా పారిపోవడమో, దాక్కోవడమో చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. దేశం ముందుకెలా వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అరాచకం..

తాలిబన్ల దురాక్రమణతో అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులు.. ప్రపంచదేశాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను పూర్తిగా తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకున్న తాలిబన్లు అక్కడ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పనులకు తెగబడుతున్నారు. కాందహార్‌, హెరాత్‌ ప్రాంతాల్లోని భారత రాయబార కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. అక్కడి అల్మారాల్లో, బల్లల కింద ఉన్న పత్రాలను ముష్కర మూకలు పరిశీలించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నేషనల్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న అఫ్గాన్ల గురించి సమాచారం సేకరించేందుకు తాలిబన్లు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు తనిఖీల అనంతరం భారత రాయబార కార్యాలయాల ఎదుట ఉన్న వాహనాలను సైతం తాలిబన్లు ఎత్తుకెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

బయోమెట్రిక్​ డివైస్​లు స్వాధీనం..

అమెరికాకు సంబంధించిన సైనిక రహస్యాలను సేకరించేందుకు తాలిబన్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. తాలిబన్లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్న అమెరికన్‌ సైనికుల వివరాలను తెలుసుకునేందుకు వారు ఉపయోగించిన బయోమెట్రిక్‌ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత వారమే తాలిబన్లు బయోమెట్రిక్‌లను తీసుకెళ్లినట్లు యూఎస్‌ జాయింట్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండర్‌ ఒకరు వెల్లడించారు. బయోమెట్రిక్‌ పరికరాల్లో అమెరికన్‌ బలగాల వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌లతో పాటు వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తాలిబన్ల వద్ద ఎంతమేర అమెరికన్‌ బలగాల సమాచారం ఉందన్న దానిపై స్పష్టత లేదని యూఎస్‌ కమాండర్‌ అన్నారు.

అఫ్గాన్‌ను విడిచి వెళ్లేందుకు ఏకైక మార్గంగా ఉన్న కాబుల్‌ అంతర్జాతీయ విమానశ్రయం పైనా తాలిబన్లు దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన ఈ ముష్కర మూకలు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పలువురిని విమానాశ్రయాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కాబుల్‌లోను ఎయిర్‌పోర్టును 4 వేల 500మంది అమెరికా సైనికులు నియంత్రిస్తుండగా అక్కడికి చేరుకునే టర్మినల్స్ అన్నింటినీ తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.

కాల్పులు..

ఆస్ట్రేలియా సైన్యం కోసం పనిచేసిన అఫ్గాన్ అనువాదకుడిపై కాబుల్ విమానాశ్రయం వెలుపల ఉన్న ఓ చెక్‌పోస్టు వద్ద తాలిబన్లు కాల్పులు జరిపారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఈ ప్రమాదంలో అతని కాళ్లల్లోకి తూటాలు దూసుకుపోయినట్లు ద గార్డియన్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది.

అటు సరిహద్దుల్లోనూ తాలిబన్లు తమదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని అఫ్గానిస్థాన్ జెండాలను పీకేసిన తాలిబన్ల ముఠా వాటి స్థానంలో ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్​కు చెందిన తెల్ల జెండాలను ఎగురవేసింది. అలాగే అఫ్గాన్ భద్రతా బలగాలు పహారా కాసేచోట తుపాకులతో తాలిబన్ మిలిటెంట్లు కనిపిస్తున్నారు.

పాక్​ సరిహద్దులోనూ..

పాకిస్థాన్‌తో సరిహద్దుల్లోని అత్యంత రద్దీగా ఉండే.. తోర్ఖామ్ చెక్‌పోస్టు ప్రస్తుతం తాలిబన్ల అధీనంలో ఉంది. తాలిబన్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాకిస్థాన్‌ తమ సరిహద్దులను మూసివేసింది. అయితే వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అఫ్గాన్‌తో ఉన్న సరిహద్దులను తెరిచిపెట్టింది. సరైన అనుమతులతో వచ్చే కొంతమందిని మాత్రమే అఫ్గాన్‌ నుంచి తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు.. అనుమతి ఇస్తున్నట్లు పాక్ భద్రతా అధికారి తెలిపారు. అందుకే సరిహద్దుల్లో తనిఖీల ప్రక్రియను ముమ్మరం చేశామని వివరించారు.

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఇరుగుపొరుగు దేశాలపై ప్రభావం చూపుతోంది. సరిహద్దుల ద్వారా జరిగే వ్యాపారాన్ని తాలిబన్ నిలిపేసినట్లు భారత్ పేర్కొంది. దీని వల్ల కొన్ని మిలియన్ డాలర్ల మేర ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడుతున్నట్లు భారతీయ ఎగుమతుల సమాఖ్య సంస్థ-ఎఫ్ఐఈఓ వెల్లడించింది.

ఇవీ చూడండి:భారత్​పై తాలిబన్ల ఆంక్షలు- ఎగుమతులు, దిగుమతులు బంద్​!

క్లారిటీ ఇచ్చిన తాలిబన్లు- అఫ్గాన్​లో కొత్త రూల్స్ ఇలా...

నిజంగా..! తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంతోషిస్తున్నారా..!

ABOUT THE AUTHOR

...view details