1990ల నాటి క్రూర పాలన గుర్తుకు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారు అఫ్గాన్‌లోని తాలిబన్లు(Afghanistan Taliban). దోషులకు బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా ఓ ముగ్గురు దోషుల మృతదేహాలను నడివీధిలో క్రేన్‌కు వేలాడదీసి, ప్రదర్శించారు.
అసలేం చేశారు?
తన ఇంటిని బద్దలుగొట్టి చొరబడాలని ముగ్గురు దుండగులు యత్నించగా.. ఓ వ్యక్తి వారిని చంపేశాడని డిప్యూటీ గవర్నర్ మాల్వాయ్ షిర్ అహ్మద్ ముజాహిర్.. మీడియాకు తెలిపారు. దోషుల మృతదేహాలను తాలిబన్లు.. ఈశాన్య హెరాత్‌లోని ఓబే జిల్లాలో రెండు క్రేన్లకు వేలాడదీసినట్లు చెప్పారు.
సెప్టెంబర్‌లోనూ..
రెండు వారాల కిందట ఇదే తరహాలో హెరాత్ నగరంలో ప్రధాన కూడలి వద్ద మృతదేహాలను క్రేన్‌కు కట్టి వేలాడదీశారు తాలిబన్లు. ఓ తండ్రి, కొడుకును కిడ్నాప్ చేసేందుకు నలుగురు దుండగులు యత్నించగా.. ఓ పోలీసు అధికారి వారిని కాల్చాడు. అనంతరం.. వారిలో ఒకరి మృతదేహాన్ని కూడలి వద్ద క్రేన్‌కు వేలాడదీశారు. మిగతావారి మృతదేహాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేలాడదీసి, ప్రదర్శించారు.
"నేరగాళ్లకు తాము సేఫ్ జోన్లో లేము అని తెలియజేసేందుకే ఈ తరహా చర్య వెనుక ఉద్దేశమని" ఓ గుర్తు తెలియని తాలిబన్ గతంలో మీడియాకు తెలిపారు.
1996 నుంచి 2001 అఫ్గాన్‌ను పరిపాలించిన తాలిబన్లు.. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేశారు. దొంగల చేతులు, కాళ్లు నరికి వేలాడదీయడం, వ్యభిచారం చేసేవారిని దాడిచేసి చంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు మళ్లీ అదే తరహా చర్యలకు పాల్పడుతూ.. అఫ్గాన్ వాసులను భయాందోళనకు గురిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.