తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన నెలకొంది(taliban girls education). ఈ ఆందోళనలకు మరింత బలం చేకూర్చే విధంగా తాలిబన్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే క్లాసులకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.
శుక్రవారం ఈ ప్రకటన ఫేస్బుక్లో దర్శనమిచ్చింది. అబ్బాయిల గురించే ఇందులో ఉంది. అమ్మాయిల గురించి ఎలాంటి ప్రకటన లేదు(taliban education news). మార్గదర్శకాల్లోనూ వారి ప్రస్తావన లేకపోవడం.. బాలికలు, మహిళలపై కఠిన ఆంక్షలు ఉంటాయన్న వాదనలకు మరింత ఊతమిస్తోంది.
గత తాలిబన్ల పాలనలో ఇటువంటి కఠిన వైఖరే ఉండేది. అయితే అప్పుడు కనీసం 1-6 తరగతుల బాలికలను చదువుకోనిచ్చేవారు. ఆ తర్వాత పాఠశాలలు, పని ప్రదేశాల్లోకి వారికి అనుమతులు లేవు. అఫ్గాన్‌లోని కొన్ని రాష్ట్రాల్లో అనేకమంది మహిళలు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆసుపత్రి, విద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరికి మాత్రమే అనుమతులుండేవి.
వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు విలవిల...
అమెరికా దళాలు వైదొలగకముందే.. ఆగస్టు 15న కాబుల్‌పై జెండా ఎగరేశారు తాలిబన్లు. ఫలితంగా ఆ దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు పోటీపడి కాబుల్ విమానాశ్రయం వద్ద బారులుతీరారు. పలువురు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోగా.. అనేకమంది అక్కడే ఉండిపోయారు. కొన్ని రోజుల అనంతరం దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.