తెలంగాణ

telangana

ETV Bharat / international

యాక్షన్‌ సినిమాను తలదన్నేలా.. తాలిబన్ల నుంచి ఎస్కేప్! - taliban soviet arms and ammunitions

తాలిబన్ల చేతికి ఆయుధాలు దొరకడం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి వారికి అయుధం దక్కితే ఉన్మాదులుగా మారిపోతారు. గతంలో ఇలాగే ఆయుధ నిధి దక్కించుకున్న తాలిబన్ల నుంచి రష్యా.. చాకచక్యంగా వాటిని తిరిగి తీసుకొచ్చింది. ముష్కరమూక కళ్లలో దుమ్ముకొట్టి పరార్‌ అయింది. దీనిపై ఓ పుస్తకం కూడా వెలువడింది. అసలు అప్పుడు జరిగిందేంటంటే...

AFGHAN MOVIE ESCAPE
రష్యా ఆయుధాలు తాలిబన్

By

Published : Aug 17, 2021, 9:14 PM IST

ఏ యుద్ధంలోనూ ప్రత్యర్థుల చేతికి మన ఆయుధాలు దొరకడం అత్యంత ప్రమాదకరం. వారు ఆ ఆయుధాలను వాడటమే కాదు.. వాటిల్లోని లోటుపాట్లు గ్రహించి మనల్ని దెబ్బతీస్తారు. ఈ విషయం అమెరికాకు తెలియనిది ఏమీ కాదు..! అఫ్గాన్‌లో సోవియట్‌ దురాక్రమణ ముగిశాక అంతర్యుద్ధం మొదలైంది. అనంతరం ముజాహిదీన్‌లు పాలన ప్రారంభించారు. వారిలో వారే ఘర్షణలకు దిగడంతో కొత్తగా వచ్చిన తాలిబన్లు అధికారాన్ని అత్యంత వేగంగా చేజిక్కించుకోవడానికి కూడా కారణం ఓ భారీ ఆయుధ డంపే. అలా ఓ యుద్ధవిమానం దక్కించుకొని తాలిబన్లు రష్యా వ్యాపారి విమానాన్ని హైజాక్‌ చేశారు. కానీ, ఏడాది తర్వాత రష్యా సిబ్బంది వారికి మస్కాకొట్టారు.

ఆయుధాలతో నింపేసిన సోవియట్‌-అమెరికా..!

1979లో సోవియట్‌ యూనియన్‌ అఫ్గానిస్థాన్లో అడుగుపెట్టినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ జరిగిన ప్రచ్ఛన్న యుద్ధానికి వివిధ దేశాలు వేల టన్నుల ఆయుధాలను అఫ్గానిస్థాన్‌లో కుమ్మరించాయి. వీటిల్లో సోవియట్‌ యూనియన్‌ ఆయుధాలు కూడా భారీగా ఉన్నాయి. 1979-89 మధ్యలో జరిగిన సివిల్‌ వార్‌ సమయంలో అమెరికా తన మిత్ర దేశాల నుంచి కొన్ని వేల టన్నుల ఆయుధాలను సమీకరించి పాక్‌ ఐఎస్‌ఐ సాయంతో ఇక్కడకు తరలించింది. 1980ల్లో నాలుగు లక్షల కలష్నికోవ్‌ రైఫిల్స్‌ను సరఫరా చేసింది. రష్యన్లు అఫ్గాన్‌ నుంచి వెళ్లిపోయి, నజీబుల్లా పాలన అంతమయ్యాక కూడా ప్రపంచ దేశాల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు ఇక్కడకు చేరాయి. చాలా దేశాలు ఇరాన్‌ సాయంతో నార్తర్న్‌ అలయన్స్‌కు ఆయుధాలను అందించాయి.

800 ట్రక్కుల ఆయుధాలను దక్కించుకొని..

1992 నుంచి అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ చట్టాల అమలు, ఇతర సామాజిక పరిస్థితులపై అసంతృప్తిగా ఉన్న ముల్లా ఒమర్‌ 1994లో తాలిబన్‌ సంస్థను స్థాపించారు. తొలుత 50 మందితో మొదలైనా.. కొద్ది నెలల్లోనే వీరి సంఖ్య దాదాపు 15 వేలకు చేరుకొంది. వీటిల్లో అత్యధికంగా అఫ్గాన్‌ పష్తూన్‌ ముజాహిద్దీన్‌లు ఉన్నారు. వీరికి పాక్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి బలమైన మద్దతు లభించింది. 1994లో స్పిన్‌ బౌల్దక్‌ వద్ద తాలిబన్‌ ఫైటర్లు భారీ సంఖ్యలో ఆయుధ డంపును స్వాధీనం చేసుకొన్నారు.

ఈ ఆయుధ డంప్‌లో వేల సంఖ్యలో కలిష్నికోవ్‌ రైఫిల్స్‌, 120 శతఘ్నులు, భారీ సంఖ్యలో చిన్న ఆయుధాలు ఉన్నాయని సిప్రీ నివేదిక పేర్కొంది. దాదాపు ఇవి 800 ట్రక్కులకు ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఇవన్నీ సోవియట్‌ జమానాలోని ఆయుధాలు. వీటిని అక్కడి గుహల్లో భద్రపర్చి ఉంచారు. ఈ ఆయుధ నిధితో తాలిబన్లను ఒక్కసారి పేట్రేగిపోయారు. వారు మరికొన్ని నెలల్లోనే హెక్మత్యార్‌ నేతృత్వంలోని హజీబ్‌ -ఇ- ఇస్లామి సేనలను జయించి కాందహార్‌ పట్టణాన్ని, విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే సరిహద్దుల్లోని స్పిన్‌ బౌల్దక్‌ వద్ద చమర్‌ చెక్‌పోస్టు తాలిబన్ల వశం కావడంతో.. పాక్‌ వైపు నుంచి భారీ సంఖ్యలో ఫైటర్లు కాందహార్‌ ఆక్రమణకు తాలిబన్లలో చేరారు. ఈ ఆక్రమణ తాలిబన్లకు మరింత శక్తిమంతమైన భారీ ఆయుధాలు లభించాయి. అక్కడి షహీన్‌బంద్‌ ఎయిర్‌ బేస్‌లోని మిగ్‌-21 విమానం, ఎంఐ-17 హెలికాప్టర్‌, శతఘ్నులు దక్కించుకొన్నారు.

తాలిబన్లకు మస్కా కొట్టిన రష్యా..!

ఆ తర్వాత నుంచి తమ వ్యతిరేక దళాలకు తరలించే ఆయుధ కాన్వాయ్‌లపై తాలిబన్లు దాడి చేయడం మొదలుపెట్టారు. నాటి అఫ్గాన్‌ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ రబ్బానీ వర్గానికి రష్యా ఆయుధాలను సరఫరా చేసేది. రష్యాకు చెందిన ఆయుధ డీలర్‌ విక్టర్‌ బౌట్‌కు చెందిన ట్రాన్స్‌ ఏవియేషన్స్‌(యూఏఈలో రిజిస్టర్డ్‌ సంస్థ)కు చెందిన ఐఎల్‌-76టీడీ రవాణావిమానం 1995 ఆగస్టు 3 వ తేదీన అలబానియా నుంచి అఫ్గానిస్థాన్‌కు బయల్దేరింది. ఈ విమానాన్ని తాలిబన్లు మిగ్‌-21 యుద్ధవిమానంతో అడ్డగించి బలవంతంగా కాందహార్‌ ఎయిర్‌పోర్టులో దింపారు. సిబ్బందిని బందీలుగా పట్టుకొన్నారు. దీనిలో ఏడుగురు రష్యన్‌ సిబ్బంది, 30 టన్నుల ఆయుధాలు ఉన్నాయి. దీంతో దాదాపు ఏడాదిపాటు రష్యా-తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా సెనెటర్‌ హాంక్‌ బ్రౌన్‌ మధ్యవర్తిత్వం వహించారు. ఈ క్రమంలో ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. అనంతరం విమాన మెయింటెనెన్స్‌కు రష్యా సిబ్బందిని తాలిబన్లు అనుమతించారు.

ఇదే అదునుగా రష్యా సిబ్బంది విమానంతో సహా పారిపోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వారు సాధారణ మెయింటెనెన్స్‌తోపాటు.. విమానం టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధం చేశారు. 1996 ఆగస్టు 16వ తేదీన రష్యన్లకు కాపలాగా ఉన్న తాలిబన్‌ సిబ్బందిలో సగం మంది మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్లారు. దీంతో రష్యా సిబ్బంది చాకచక్యంగా విమానాన్ని బ్యాటరీ శక్తి సాయంతో స్టార్ట్‌ చేసి రన్‌వేపైకి పరుగులు పెట్టించారు. తాలిబన్లు ట్రక్కుల సాయంతో దానిని అడ్డుకోవాలని చూసినా.. తప్పించుకొని టేకాఫ్‌ చేశారు. వారు అక్కడి నుంచి నేరుగా యూఏఈకి తీసుకెళ్లి ల్యాండ్‌ చేశారు. దీనిపై 'ఎస్కేప్‌ ఫ్రమ్‌ కాందహార్‌'పుస్తకం కూడా వచ్చింది.

తాలిబన్ల చేతికి ఆయుధాలు దొరకడం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి వారికి అయుధం దక్కితే ఉన్మాదులుగా మారిపోతారు. బగ్రాం ఎయిర్‌ బేస్‌లో అమెరికన్‌ సైనికులు ఉపయోగించే చాకులు, కత్తులు, చిరు ఆయుధాలను ధ్వంసం చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటిది భారీ ఆయుధాలను ధ్వంసం చేయకుండా తాలిబన్ల పరం చేయడం అనాలోచితం. ఇప్పుడు కూడా అమెరికా ఆయుధాలు వారి చేతిలో పడటంతో శక్తివంతులుగా మారి చివరికి కాబుల్‌ను ఆక్రమించారు. ఇలా జరుగుతుందని అమెరికాకు తెలియని విషయమేమీ కాదు. ఇప్పుడు వారి చేతికి విమానాలు, హెలికాప్టర్లు వచ్చాయి. దీంతో వారు ఎప్పుడు ఏమి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details