అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Afghanistan Taliban) తమ దురాగతాల పరంపరను కొనసాగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగగానే కాబుల్ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నారు. అదే క్రమంలో.. ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి వారు కాందహార్‌లో విహరించారనే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అఫ్గాన్‌ను(Afghan Crisis) విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం అక్కడే వదిలేసి వెళ్లింది. కాగా అగ్రరాజ్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌లో తాలిబన్లు కాందహార్‌లో విహరించారు. అయితే ఆ హెలికాప్టర్‌కు ఓ వ్యక్తిని తాడుతో వేలాడదీశారు. అది గాల్లో ఎగురుతుండగా.. దాని కింద తాడుకు ఓ వ్యక్తి వేలాడటాన్ని పలువురు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వ్యక్తి మృతదేహమేనని, అతడిని చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారని అక్కడి పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. దీన్నే ఆధారంగా చూపుతూ రిపబ్లికన్లు భైడెన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. అమెరికా బలగాలు వెళ్లిపోవడం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.