విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్ మహిళలు(Kabul Women Protest) చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు(Afghan Taliban) విరుచుకుపడుతున్నారు. తాజాగా కాబుల్‌లో(Kabul News) ప్రదర్శన చేపట్టిన మహిళలపై వారు హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6- 12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ 'స్పాంటేనియస్ మూవ్‌మెంట్ ఆఫ్ అఫ్గాన్ వుమెన్ యాక్టివిస్ట్స్' బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు.
'మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దు'.. ఇలా వివిధ నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ఇది గమనించిన తాలిబన్లు వెంటనే వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో వారి దుశ్చర్యలను రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్టులనూ నిలువరించినట్లు పేర్కొంది.