అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం రాకతో ప్రజలు బిక్కుబిక్కమంటూ ప్రాణభయంతో హడలిపోతున్నారు. ముఖ్యంగా మహిళలైతే మళ్లీ పాత రోజులొస్తాయని బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళా జర్నలిస్టు తాలిబన్లతో ఇంటర్వ్యూ నిర్వహించారు. తమ పాలనలో ఆడవాళ్లకు ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయా? అని ప్రశ్నించారు. అందుకు తాలిబన్లు అవునని సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాల్లో మహిళా నేతలకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంటుందా? అని జర్నలిస్టు అడిగిన మరో ప్రశ్నకు వారు పగలబడి నవ్వారు. నవ్వు ఆపుకోలేక కెమెరా ఆఫ్ చేయమని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహిళలంటే తాలిబన్లకు ఎంత చులకనో దీన్ని చూస్తే అర్థమవుతోంది.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగాక ఒక్కో రాష్ట్రాన్ని తమ వశం చేసకున్నారు తాలిబన్లు. మెరపుదాడులు చేస్తూ రాజధాని కాబుల్‌ను కూడా ఆదివారం ఆక్రమించుకున్నారు. వీరి దెబ్బకు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు.