తెలంగాణ

telangana

ETV Bharat / international

మెరుపు వేగంతో తాలిబన్ల దురాక్రమణ- అధ్యక్షుడు రాజీనామా! - తాలిబన్ కాబుల్

అఫ్గాన్​లో తాలిబన్లు రెచ్చిపోయారు. మరో మూడు కీలక నగరాలను ఆక్రమించారు. మెరుపు వేగంతో కాబుల్ వైపు దూసుకెళ్తున్నారు. వారం రోజుల్లోగా రాజధానిని స్వాధీనం చేసుంటామని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు ఏం చేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

taliban news
తాలిబన్లు

By

Published : Aug 13, 2021, 4:29 PM IST

మొన్న..బదఖ్షాన్​, బఘ్లాన్​, ఫరాహ్​...

నిన్న..గాజ్నీ, హేరత్​..

నేడు.. లష్కర్ గాహ్(హెల్మండ్ రాజధాని), ఉరుగ్జాన్, అత్యంత కీలకమైనకాందహార్....

గత మూడు రోజులుగా అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు హింసాత్మక పద్ధతిలో ఆక్రమించుకున్న నగరాల జాబితా ఇది. 72 గంటల్లోనే ఎనిమిది కీలకమైన నగరాలను ముష్కర మూకలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఫలితంగా 34 రాష్ట్రాలు ఉన్న అఫ్గాన్​లో.. 18 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి.

తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రాంతం. ఏప్రిల్​లో(పై మ్యాప్) అలా, ఆగస్టులో ఇలా

రెండు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటిష్, నాటో దళాలు భీకర పోరాటం సాగించిన హెల్మండ్ రాష్ట్రాన్నీ తాలిబన్లకు కోల్పోవడం అక్కడి పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. తాలిబన్లకు లొంగిపోతున్నట్లు గుర్తుగా.. హెల్మండ్ రాష్ట్ర రాజధానిలో తెల్లటి జెండాలను అధికారులు ఎగురవేశారు. అయితే, లష్కర్ గాహ్ వెలుపల ఉన్న మూడు సైనిక స్థావరాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

కాందహార్​లో సైన్యం, తాలిబన్ల ఘర్షణ సందర్భంగా పేలుళ్లు
కాందహార్ నగరం నుంచి వెళ్లిపోతున్న సైనిక అధికారులు

కాబుల్​కు ఎంతదూరం ఉన్నారు?

ప్రస్తుతం మూడింట రెండో వంతు అఫ్గాన్ భూభాగం తాలిబన్ల చేతిలో ఉంది. కాబుల్​ వరకు ముష్కరులు ఇంకా చేరుకోలేదు. ప్రత్యక్ష దాడులేవీ రాజధానిపై జరగలేదు. కానీ, వరుసగా ఒక్కో నగరాన్ని మెరుపు వేగంతో కోల్పోవడం.. అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాలిబన్లు ఆక్రమించుకున్న గాజ్నీ నగరానికి కాబుల్ 150 కి.మీ దూరంలో ఉంది. కాందహార్​కు సుమారు 500, లష్కర్ గాహ్​కు 630 కి.మీ దూరంలో ఉంది.

గాజ్నీ నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ముష్కరులు
పాకిస్థాన్ సరిహద్దు వైపు వెళ్తున్న అఫ్గాన్ పౌరులు
పాక్ సరిహద్దు సమీపంలో..

అమెరికా ఏం చేస్తోంది?

అంతా బాగానే ఉన్నా.. ఇవన్నీ గమనిస్తూ అమెరికా ఏం చేస్తుందనే అనుమానం మనలో కలగక మానదు. గడిచిన 20 ఏళ్లుగా అఫ్గాన్​లో తాలిబన్లపై భీకర పోరు సాగించిన అమెరికా ఇప్పుడు దేశం నుంచి జారుకుంది. ప్రస్తుతం తాలిబన్లు అఫ్గాన్​ను పూర్తిగా ఆక్రమించడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని లెక్కలేస్తోంది. 90 రోజుల్లో కాబుల్ కుర్చీపై తాలిబన్లు కూర్చుంటారని కొద్దిరోజుల క్రితం లెక్కగట్టిన అగ్రరాజ్య సైనిక నిఘా విభాగం.. తాలిబన్ల మెరుపు వేగానికి అవాక్కై ఇప్పుడు దాన్ని 30 రోజులకు కుదించింది. అయితే, తాలిబన్లు మాత్రం కాబుల్​ను మరో వారం రోజుల్లోనే కాబుల్​ను ఆక్రమించుకుంటామని చెబుతున్నారు.

తాలిబన్ల దురాక్రమణను వేడుకలా జరుపుకుంటున్న పాక్​లోని ఓ రాజకీయ పార్టీ నేతలు

మరోవైపు, కాబుల్​ రాయబార కార్యాలయంలో పనిచేసే తమ దేశ సిబ్బందిని అఫ్గాన్ నుంచి తరలించేందుకు మూడు వేల బలగాలను అమెరికా పంపిస్తోంది. అదే సమయంలో, నగరాల్లో దాడులు ఆపాలని, రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాలని ముష్కరులకు హితవు పలుకుతోంది. హింస ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అఫ్గాన్​ను బహిష్కరిస్తామని, అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తామని హెచ్చరిస్తోంది.

అఫ్గాన్ సైనిక వాహనాలు

మిగతా దేశాల మాటేంటి?

బలప్రయోగం ద్వారా ఏర్పడిన అఫ్గాన్ సర్కారును గుర్తించబోమంటూ అమెరికా, భారత్, చైనా సహా 12 దేశాలు తీర్మానించుకున్నాయి. ఖతార్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, యూకే, ఈయూ, జర్మనీ, నార్వే, తజకిస్థాన్, టర్కీ, తుర్కమెనిస్థాన్ దేశాలదీ ఇదే వైఖరి.

ద్విచక్రవాహనాలపై ముష్కర మూకలు
  • ఇక మిగిలిన దేశాలు అఫ్గాన్​లోని తమ పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
  • బ్రిటన్ 600 మంది సైనికులను పంపిస్తోంది. తమ పౌరులను సురక్షితంగా అఫ్గాన్ దాటించేందుకు వీరిని పంపుతోంది.
  • రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించేందుకు కెనడా ప్రత్యేక దళాలను పంపుతోంది.
  • కాబుల్​లో ఎంబసీని ఇదివరకే మూసేసిన ఆస్ట్రేలియా.. తమ దేశం కోసం పనిచేసిన అఫ్గాన్ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తోంది. తమకు సహకరించిన ప్రతి ఒక్క అఫ్గాన్ పౌరుడిని కాపాడతామని తెలిపింది. తాలిబన్లతో వారికి ముప్పు ఉన్న కారణంగా ఈ మేరకు వారిని తరలిస్తోంది.

ఉపాధ్యక్షుడు పరార్!

మరోవైపు, అఫ్గానిస్థాన్ ఉపాధ్యక్షుడు తజకిస్థాన్​కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు అదుపు తప్పిన నేపథ్యంలో కాబుల్​ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అదే సమయంలో తాలిబన్లకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సంధి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. దోహాలో జరుగుతున్న చర్చల్లో భాగంగా అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమైనందున.. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.

ఈ పరిస్థితుల్లో అష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిందని, తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. కొద్ది గంటల్లో ఏం జరుగుతుందనే చర్చ ఊపందుకుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details