తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ను పొగుడుతూనే.. మోదీ సర్కార్​కు తాలిబన్ల హెచ్చరిక

అఫ్గానిస్థాన్​లో భారత్​ సైనిక చర్యలు చేపట్టకూడదని తాలిబన్​ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంలో ఉన్న దౌత్యాధికారులకు ఎలాంటి హానీ తలపెట్టమని హామీ ఇచ్చారు.

taliban, suhail shaheen
తాలిబాన్లు, సుహేల్ షహీన్

By

Published : Aug 14, 2021, 9:58 AM IST

Updated : Aug 14, 2021, 10:50 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆక్రమణలు శరవేగంగా పెరుగుతున్నాయి. అమెరికా సైన్యం అఫ్గాన్​ను వీడిన కొద్ది వారాల వ్యవధిలోనే కాందహార్‌, హేరత్‌, లష్కర్‌ఘాలతో కలిపి 18 రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు వశపరచుకొన్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడారు తాలిబన్​ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్. 'భారత్.. అఫ్గాన్​ ప్రజలకు సాయం చేయడం, జాతీయ ప్రాజెక్టు పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమే.. కానీ అఫ్గాన్​లో సైనిక చర్యలు చేపడితే నష్టం జరిగేది ఎవరికో అర్థం చేసుకోవాలి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్​లో సైనిక చర్యలు చేపడుతున్న ఇతర దేశాల సైనికుల పరిస్థితిని గమనించాలని పేర్కొన్నారు.

"అఫ్గాన్​ ప్రజల శ్రేయస్సు కోసం భారత్​ సాయం చేయడం హర్షనీయం. డ్యామ్​లు, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ముందడుగు వేయడం మంచి విషయం. కానీ, అఫ్గాన్​లో సైనిక చర్యలకు మాత్రం భారత్​ దూరంగా ఉండాలి."

--సుహేల్ షహీన్, తాలిబన్ అధికార ప్రతినిధి.

తాలిబన్లు- అఫ్గాన్ సైన్యం మధ్య ఘర్షణ నేపథ్యంలో.. భారత్, అమెరికా సహా చాలా దేశాలు తమ అధికారులను వెనక్కి రప్పించాయి. దీనిపై మట్లాడిన షహీన్.. దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయాలకు ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. దౌత్యాధికారులను లక్ష్యం చేసుకోమని ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మెరుపు వేగంతో తాలిబన్ల దురాక్రమణ- అధ్యక్షుడు రాజీనామా!

అఫ్గాన్​లో నివసిస్తున్న సిక్కులు, హిందువుల భద్రత అంశంపై కూడా మాట్లాడారు షహీన్. వారు తమ మతపరమైన ఆచారాలు పాటించవచ్చని, వేడుకలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

"తాలిబన్లకు పాక్​ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నవి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు మాత్రమే. నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాజకీయంగా లాభం పొందేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఏ దేశం కూడా మరో దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్గాన్​ భూభాగాన్ని ఉపయోగించుకోకూడదనే నియమాన్ని మేం ఏర్పాటు చేసుకున్నాం."

--సుహేల్ షహీన్, తాలిబన్ అధికారి ప్రతినిధి.

తమకు లొంగిపోయిన రాజ్యాలనే తాలిబన్లు వశపరుచుకుంటున్నారని షహీన్ తెలిపారు. అయితే.. ఇది హింస వల్ల జరగడం లేదని, చాలా ప్రాంతాల వారు తమంతట తామే తాలిబన్లకు లొంగిపోతున్నారని అన్నారు. ప్రజలను చంపడం, హింసకు పాల్పడటం అఫ్గాన్​ ప్రభుత్వం చేస్తుందని దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని షహీన్ ఆరోపించారు.

అఫ్గాన్​ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం ప్రజలకు అవసరమని షహీన్ అన్నారు. కానీ, ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు.

చర్చలతో పరిష్కారం..

అఫ్గానిస్తాన్‌లో తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ తాలిబన్లు విజృంభిస్తున్న వేళ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌.. తాలిబన్లకు కీలక సూచనలు చేశారు. తాలిబన్లు.. తమ దాడులను వెంటనే నిలిపివేయాలన్న ఆంటోనియో.. ఈ సుదీర్ఘ అంతర్యుద్ధాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గట్టిగా కోరారు.

"యుద్ధంవైపు అడుగులు వేస్తున్న వారికి అంతర్జాతీయ సంఘం ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. సైన్యంతో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం సరైనది కాదు. దీని వల్ల అంతర్యుద్ధం మరింత తీవ్రమవుతుంది. ఆఫ్గానిస్థాన్​ ఒంటరిగా మిగిలిపోతుంది. పౌరులపై దాడి చేయడం కూడా.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం నిబంధనల ఉల్లంఘన అవుతుంది. దీనికి నేరస్థులు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది."

--ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్.

తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ప్రజలు, జర్నలిస్టులపై తీవ్ర ఆంక్షలు విధిస్తుండటంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అఫ్గాన్‌ బాలికలు, మహిళల హక్కులను కాలరాస్తూ వారి పట్ల తాలిబన్లు విచక్షణారహితంగా నడుచుకోవడం హృదయ విదారకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు దశాబ్దాల అంతర్యుద్ధాన్ని పరిష్కరించుకునేందుకు వెంటనే చర్చలను ప్రారంభించాలని ఐరాస విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి:తాలిబన్ల ఉక్కుపిడికిట్లో అఫ్గాన్‌- రష్యా, చైనా మద్దతు!

Last Updated : Aug 14, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details