అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ పాలనపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ చైనా మీడియాతో మాట్లాడాడు. అఫ్గాన్ ప్రజల మనోభావాలను అంతర్జాతీయ సమాజం గౌరవించి, తాలిబన్ ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరాడు.
"చైనా భారీ ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశం అఫ్గాన్ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించగలదు. కొన్నేళ్లుగా చైనా, రష్యాలతో మాకు సంబంధాలున్నాయి. అఫ్గాన్ నుంచి వారికి హాని ఉండదు. మా పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఎవరూ అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం. ఇది మా ప్రయోజనాలకు ఎంతో కీలకమైన అంశం."
-సుహైల్ షహీన్, తాలిబన్ సంస్థ ప్రతినిధి.
"అఫ్గాన్ పునర్నిర్మాణ క్రతువులో అమెరికా సహా పొరుగు, ప్రాంతీయ, ప్రపంచ దేశాల సాయం మాకు అవసరం. కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ సంస్థలు నిధులను విడుదల చేయాలి. విమానం ఎక్కితే బ్రిటన్, అమెరికాల్లో స్థిరపడవచ్చన్న తప్పుడు ప్రచారం జరుగుతోంది. అందుకే కొందరు అఫ్గాన్‌ను విడిచి వెళ్లేందుకు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారు. తాలిబన్ విజయం... బలవంతపు పాలనపై జరిగిన ప్రజా తిరుగుబాటు ఫలితం. ఇది ఎన్నికల ద్వారా సిద్ధించింది కాకపోవచ్చు. కానీ, ప్రజలమద్దతుతోనే జరిగింది" అని షహీన్ పేర్కొన్నాడు.