చైనా సూపర్ కంప్యూటింగ్ శక్తులను హరించేలా అమెరికా ఇటీవల విధించిన ఆంక్షలకు తైవాన్ మరింత పదును పెట్టింది. ఫలితంగా ఇప్పుడు అత్యంత కీలకమైన టెక్నాలజీ డ్రాగన్‌కు దక్కడం కష్టంగా మారనుంది. చైనా దూకుడుగా తైవాన్ గగనతలంలోకి 25 విమానాలను పంపించిన రోజుల్లోనే తైవాన్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. ఇప్పటికే అమెరికా నుంచి పలు కీలక టెక్నాలజీలు అందక చైనా కంపెనీలు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.
చైనాకు చెందిన ఏడు సూపర్ కంప్యూటింగ్ సంస్థలపై అమెరికా విధించిన 'ఎకనామిక్ బ్లాక్‌లిస్ట్' ఆంక్షలకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తైవాన్ బుధవారం ప్రకటించింది. అంతేకాదు ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిందే తడవుగా తైవాన్‌కు చెందిన చిప్ తయారీ కంపెనీ స్పందించింది. అమెరికా ఆంక్షలు విధించిన సంస్థల్లో ఒకదానికి సరఫరాలను ఆపేసింది. టెక్ పవర్ హౌస్‌గా పేరున్న తైవాన్‌లోని సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో ముందు వరుసలో నిలుస్తాయి. ఈ సందర్భంగా తైవాన్ ఆర్థికశాఖ మంత్రి వాయ్ మెయి హువా మాట్లాడుతూ..‘‘ఇక్కడ పనిచేసే కంపెనీలు ఉత్పత్తుల విషయంలో లేదా.. ఎగుమతుల విషయంలో దేశ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అందుకే అమెరికా నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి వాటికి తగినట్లు మార్పులు చేసుకోవాలి’’ అని వెల్లడించారు. చైనా గత కొన్నాళ్లుగా తైవాన్ విషయంలో కవ్వింపు ధోరణితో వ్యవహరిస్తూ.. ఆయుధాలను అభివృద్ధి చేస్తుండటంతో అమెరికా ఆంక్షలను విధించింది.
ఓ పక్క చిప్‌ల కొరత ఉన్నా..!
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కారణంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు డిమాండ్ పెరగడంతో చిప్(సెమీకండెక్టర్ల)ల కొరత ఏర్పడింది. అదే సమయంలో తైవాన్‌కు చెందిన అల్‌చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ చైనాలోని తియాన్జిన్ పైటియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్‌కు అవసరమైన పరికరాల తయారీని మంగళవారమే నిలిపివేసింది. తియాన్జిన్ సంస్థ అమెరికా బ్లాక్ లిస్ట్‌లో ఉంది. అల్‌చిప్ సంస్థ ఆదాయంలో 39శాతం ఈ సంస్థ నుంచే వస్తున్నా.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో సరఫరాను నిలిపివేశారు. ఇప్పుడు సరఫరాలను పునరుద్ధరించాలంటే అమెరికా అనుమతులు ఉండాల్సిందే. సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినా టీఎస్‌ఎంసీ కూడా తియాన్జిన్ పైటియమ్ సంస్థకు సరఫరాలను ఆపేసినట్లు సమాచారం.
ఏడు సంస్థలకు కష్టమే..
బైడన్ కార్యవర్గం మరో ఏడు సంస్థలను ‘బ్లాక్‌లిస్ట్’లోకి నెట్టింది. చైనా సైన్యానికి ఆ సంస్థలు సాయం చేయడమే కారణమని పేర్కొంది. చైనా సంస్థలు అమెరికా టెక్నాలజీ పొందకుండా ఇటీవలే తొలిసారి బైడెన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో మూడు సంస్థలతోపాటు నాలుగు చైనా నేషనల్ కంప్యూటర్ సెంటర్‌కు చెందిన మూడు బ్రాంచీలు ఉన్నాయి.