Afghan jails: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వారి అరాచక పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోగా.. కనీసం తినేందుకు తిండిలేక చాలామంది తమ కన్న బిడ్డలను విక్రయించి పూటగడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ తాలిబన్ మూకలు.. ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆటవిక చట్టాలను అమలు చేస్తూ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్న నేరాలకు కూడా ప్రజలను జైళ్లలో పెట్టి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఆడ, మగ , చిన్నా, పెద్ద తేడా లేకుండా అక్రమ కేసులు పెట్టి కారాగారంలో నిర్బంధిస్తున్నారు. దీంతో.. అఫ్గాన్‌లోని జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. గరిష్ఠంగా 10 మందికి మించి ఉంచలేని ఇరుకు గదుల్లో 50మంది ఖైదీలను ఉంచుతున్నారు. తినేందుకు ఆహారం, కనీస అవసరాలు లేక వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అఫ్గానిస్థాన్‌లోనే అతిపెద్ద జైలు హెరాత్ ప్రాంతంలో ఉంది. ఈ జైలులో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులే ఖైదీలుగా ఉన్నట్లు అక్కడివారు తెలిపారు. గతంలో అమెరికా దళాలకు సహకరించిన వారిని, ఇతర ఉద్యోగులనే తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. షరియా చట్టాలను అమలు చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా శిక్షలను ఖరారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.