మత బోధనలను వక్రీకరించడం, నమ్మకాలను తప్పుదోవ పట్టించడం వల్లే ప్రపంచంలో హింస పెరిగిపోతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. అబుదబిలో ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) ఆరంభోత్సవ కార్యక్రమంలో ఉగ్రవాద సమస్యను ప్రస్తావించారు సుష్మ.
ఉగ్రవాదం అనేక జీవితాల్ని నాశనం చేసి, ప్రాంతాల్ని అస్థిరపరుస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు సుష్మ. ఉగ్రభూతం కారణంగా ప్రపంచం మొత్తానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఉగ్రవాదంపై పోరు ఒక మతంతో సంఘర్షణ కాదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.
"ఉగ్రవాదం, తీవ్రవాదం.. వీటికి వేరువేరు పేర్లు, అర్థాలు ఉన్నాయి. ఇవి విభిన్న కారణాలను ఉపయోగిస్తాయి. కానీ ప్రతి సందర్భంలోనూ... ఇవి మతాలు బోధించే అంశాలను వక్రీకరిస్తాయి. తమ విజయం కోసం నమ్మకాలను దారి మళ్లిస్తాయి. ఉగ్రవాదంపై పోరు ఒక మతంతో సంఘర్షణ కాదు. ఇస్లాం అంటే శాంతి అని అర్థం. 'అల్లా'కి ఉన్న ఏ 99 పేర్లతోనూ హింస అనే అర్థం రాదు. అలాగే... ప్రపంచంలోని ప్రతి దేశం శాంతి, కరుణకు చిహ్నాలుగా ఉండాలి."
---- సుష్మా స్వరాజ్, భారత విదేశాంగ శాఖ మంత్రి
ఓఐసీ సమావేశానికి గౌరవ అతిథి హోదాలో భారత్ హాజరు కావడం ఇదే తొలిసారి. ఓఐసీలో మొత్తం 57 ముస్లిం దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్కు గౌరవ అతిథి హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి సమావేశానికి గైర్హాజరయ్యారు.