తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియాకు దడపుట్టిస్తున్న సూపర్ స్ప్రెడర్లు - దక్షిణ కొరియా క్లబ్బుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని కింగ్‌ క్లబ్‌, ట్రంక్‌ క్లబ్‌, క్వీన్‌క్లబ్‌లను ఓ యువకుడు సందర్శించాడు. అతనికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయా క్లబ్​ల్లో సుమారు 1500 మంది రిజిస్టర్ అయ్యారు. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ బాధితులను గుర్తించే పనిలో ఉంది.

Super spreaders are terrorizing South Korea
ద.కొరియా గుండె ‘'క్లబ్‌'’డబ్‌!

By

Published : May 18, 2020, 9:37 AM IST

Updated : May 18, 2020, 11:41 AM IST

దక్షిణ కొరియాను సూపర్‌ స్ప్రెడర్లు భయపెడుతున్నారు. డేగులో 1,000 మందికిపైగా కరోనా బారిన పడేందుకు కారణమైన 'పేషెంట్‌ 31'ను మరిచిపోక ముందే అటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకొంది. కరోనా వైరస్‌ సోకిన 29 ఏళ్ల యువకుడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని కింగ్‌ క్లబ్‌, ట్రంక్‌ క్లబ్‌, క్వీన్‌క్లబ్‌లను సందర్శించాడు. ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి క్లబ్‌లను సందర్శించిన రోజు అక్కడకు దాదాపు 1,500 మందికిపైగా వచ్చినట్లు రిజిస్టర్ల ఆధారంగా తేలింది. ఇంకొందరు తప్పుడు ఫోన్‌ నంబర్లను నమోదు చేసిఉంటారనే అనుమానంతో ఆయా ప్రాంతాలకు వచ్చిన వారిని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఫోన్‌ సిగ్నల్‌ టవర్‌లో డేటాను విశ్లేషించి మొత్తం 10,905 మంది ఆ సమీప ప్రదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు.

భయాందోళనలు

ఈ ఘటన దేశాన్ని కరోనా వైరస్‌ మరోసారి ముంచెత్తుతుందనే భయాందోళనలు వ్యాపింపజేసింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 6వ తేదీ మధ్యలో ఆ క్లబ్లులను సందర్శించిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. నగరంలోని నైట్‌ క్లబ్‌లు, బార్లు, డిస్కోలు వంటి వాటిని ఈ నెల చివరి వరకు మూసేయాలని ఆదేశించారు. క్లబ్‌లకు వచ్చిన వారిలో 148 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఈ సారి కూడా దక్షిణ కొరియా చురుగ్గా పరీక్షలు నిర్వహించడాన్నే వ్యూహంగా ఎంచుకొంది. ఇప్పటికే దాదాపు 7 వేల మందిని పరీక్షించింది.అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్‌ పార్క్‌ వాన్‌ సూన్‌ పిలుపునిచ్చారు. వీటిని ఉచితంగా నిర్వహించడంతోపాటు పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

ఇదీ చూడండి:క్వారంటైన్‌ 'రాణి'గా పేరు పొందిన జర్నలిస్ట్​!

Last Updated : May 18, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details