తెలంగాణ

telangana

ETV Bharat / international

Japan PM Yoshihide Suga: బాధ్యతల నుంచి తప్పుకోనున్న జపాన్‌ ప్రధాని!

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే.. జపాన్​ ప్రధాని యోషిహిడే సుగా(Japan PM Yoshihide Suga) ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఏడాదిలో ప్రజాదరణ కోల్పోయిన నేతగా మిగిలిన సుగా.. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

Japan PM Yoshihide Suga
జపాన్​ ప్రధాని యోషిహిడే సుగా

By

Published : Sep 4, 2021, 4:39 AM IST

Updated : Sep 4, 2021, 6:41 AM IST

జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే.. ప్రధాని యోషిహిడే సుగా(Japan PM Yoshihide Suga) ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తిరిగి మరోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని ప్రకటించారు. గడిచిన ఏడాదిలో ప్రజాదరణ కోల్పోయిన నేతగా మిగిలిన సుగా.. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. టోక్యోలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని సుగా చేసిన అనూహ్య ప్రకటన.. ఆయన పార్టీతో పాటు జపాన్‌ రాజకీయాల్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

"సెప్టెంబర్‌ 17నుంచి కొత్త అధినేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు అపారమైన శక్తి కావాలని నాకు తెలుసు. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి కట్టడి చర్యలు కొనసాగించాలి. ఈ రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహించలేను. వీటిలో ఏదో ఒకటి మాత్రమే నేను ఎంచుకోవాలి. అందుకే మరోసారి ఎన్నికయ్యేందుకు ప్రచారం చేసేకంటే మహమ్మారి నియంత్రణపైనే దృష్టి సారించాలని భావిస్తున్నా."

యోషిహిడే సుగా, ప్రధానమంత్రి

అయితే, అధికారంలో ఉన్న లిబరల్‌ డెమోక్రాటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిని సెప్టెంబర్‌ 29నాటికి ఎన్నుకోవాల్సి ఉంది. పార్లమెంటులో ఆ పార్టీకి మెజారిటీ ఉన్నందున అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యోషిహిడే సుగా అధ్యక్షుడి రేసు నుంచి తప్పుకుంటున్నందున ఎల్‌డీపీ నుంచి మరికొంత మంది పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి నుంచీ సవాళ్లే..

జపాన్‌కు సుదీర్ఘ కాలంపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన షింజో అబే.. అనారోగ్య కారణాలతో గతేడాది ఆగస్టు నెలలో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం 72ఏళ్ల యోషిహిడే సుగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పలు సవాళ్లు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. రోగులను చేర్చుకునే పరిస్థితి లేక ఆస్పత్రులు రోగులను వెనక్కి పంపే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు అక్కడ 15లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా మందకొడిగానే కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ నిర్వహించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. వాటి నిర్వహణలోనూ సుగా ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదనే వాదనలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో ప్రధాని సుగా పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో ఆయన పనితీరుకు రేటింగ్ 30శాతం తగ్గిపోయినట్లు తాజాగా జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకొని.. బాధ్యతలు కొత్త వ్యక్తులకు అప్పజెప్పేందుకే సుగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:Afghan Taliban 'చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి'

Last Updated : Sep 4, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details