ఒకప్పుడు కరోనాను విజయవంతంగా నియంత్రించిన తైవాన్.. మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని తైపీలో వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. తైపీ, న్యూ తైపీలో కొత్తగా 180 వైరస్ కేసులు బయటపడ్డాయి. పూర్తి మహమ్మారి సమయంలో వచ్చిన 164 కేసుల కన్నా అది ఎక్కువ. ఈ వారం మొదట్లో ఒక అంకెలో ఉన్న కేసులు శనివారం నాటికి మూడంకెలకు చేరుకోవడం ఆందోళనకరంగా మారింది.
దీంతో తైపీ సహా న్యూ తైపీ నగర పరిసరాల్లో హెచ్చరిక స్థాయిని అధికారులు శనివారం పెంచారు. 3వ స్థాయి హెచ్చరికను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. 3వ స్థాయిలో బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులు ధరించడం, ఇళ్లలో ఐదుగురు, బహిరంగ ప్రదేశాల్లో 10 మందికి మించి కలవకూడదని ఆంక్షలు విధించారు.