China Covid Restrictions: కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ప్రపంచదేశాలు ఓవైపు కొవిడ్‌ను కట్టడి చేస్తూనే వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ, కరోనా పుట్టినిల్లు చైనా మాత్రం 'జీరో కొవిడ్ (కేసుల సంఖ్య సున్నాకు తీసుకురావడం)' వ్యూహామే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. దీంతో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా.. లక్షల సంఖ్యలో కొవిడ్ టెస్టులు, పకడ్బందీ ట్రాకింగ్ చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ చైనా మాత్రం సరిహద్దులను మూసివేయాలనే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులు తెరిస్తే చైనాలో వైరస్ వ్యాప్తి ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు అక్కడి పెకింగ్ యూనివర్సిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనం చేపట్టింది. ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3 లక్షల కొవిడ్ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.
వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడే..
అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో గడిచిన ఆగస్టులో ఉన్న కొవిడ్ విజృంభణ సమాచారాన్ని విశ్లేషించారు. ఆయా దేశాలు కొవిడ్ కట్టడికి అనుసరిస్తోన్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివః కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్ వ్యూహాన్ని పాటిస్తే.. రోజుకు 2.75 లక్షల కేసులు వెలుగు చూస్తాయని.. అదే ఫ్రాన్స్ విధానాన్ని అమలు చేస్తే నిత్యం 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.
పెకింగ్ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా అధ్యయనం చైనా సీడీసీలో ప్రచురితమైంది. మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్‌లు, నిర్ధిష్ట చికిత్స లేకుండా సరిహద్దులను తెరవడం, బయటనుంచి రాకపోకలు సాగించేవారికి క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేస్తే తీవ్ర ఇబ్బందులేనని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే వైద్యవ్యవస్థ తట్టుకునే స్థాయిలో చైనా లేదని పేర్కొంది. ఒకవేళ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను సడలిస్తే స్థానికంగా భారీ స్థాయిలో వైరస్ విజృంభణ ఉంటుందని.. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై భరించలేని భారాన్ని మోపుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది.