"తాలిబన్లు నాపై కాల్పులు జరిపి 9ఏళ్లు అయినా.. ఆ ఒక్క బులెట్ గాయం నుంచి నేనింకా కోలుకోలేకపోతున్నా. కానీ, గత నాలుగు దశాబ్దాలుగా అఫ్గాన్ ప్రజలు లక్షల కొద్దీ బులెట్లను ఎదుర్కొంటున్నారు. నేటికీ వారి వేదన అరణ్య రోదనే" అంటూ అఫ్గానిస్థాన్ పౌరుల దుస్థితిపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత(Nobel laurate) మలాలా యూసఫ్‌జాయ్(Malala Yousafzai) ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు(Taliban Afghanistan) అఫ్గాన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత అఫ్గాన్ పరిస్థితులపై(Afghan crisis) స్పందిస్తూ తాలిబన్ల కారణంగా తాను అనుభవిస్తున్న గాయాలను పంచుకున్నారు.
"రెండు వారాల క్రితం అఫ్గాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకుంటున్న సమయంలో నాకు బోస్టన్‌లో ఆరో శస్త్రచికిత్స జరిగింది. తాలిబన్ల వల్ల నా శరీరానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు డాక్టర్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది 2012 అక్టోబరు. పాకిస్థానీ తాలిబన్లు నా స్కూల్ బస్సులోకి చొరబడి నా ఎడమ కణతిపై తుపాకీతో కాల్చారు. ఆ ఒక్క బుల్లెట్ నా ఎడమ కంటిని, నా మెదడును తినేసింది. నా ముఖ నరాలను దెబ్బతీసింది. చెవిని, దవడను విరగ్గొట్టింది. సమయానికి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెషావర్ డాక్టర్లు నా ఎడమ కణతి వద్ద పుర్రెలో కొంత భాగాన్ని తొలగించారు. దాన్ని వల్లే నా ప్రాణాలు నిలిచాయి. అయితే ఆ తర్వాత మిగతా అవయవాలు పనిచేయకపోవడం వల్ల నన్ను చికిత్స నిమిత్తం మరో దేశానికి తీసుకొచ్చారు. ఇది జరిగినప్పుడు నేను కోమాలో ఉన్నాను. తాలిబన్లు వచ్చి నన్ను కాల్చినంత వరకే గుర్తుంది. ఆ తర్వాత నేను కళ్లు తెరిచి చూసేసరికి యూకేలోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో ఉన్నాను. నేను బతికానంటే నాకే నమ్మబుద్ధికాలేదు."
-మలాలా యూసఫ్‌జాయ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
పుర్రె ఎముకలో కొంతభాగాన్ని తీసి..
"కళ్లు తెరిచిన తర్వాత నా చుట్టూ అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు ఏం జరిగింది? మా నాన్న ఎక్కడ ఉన్నారు? నా చికిత్సకు డబ్బులు ఎవరు కడుతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను సతమతం చేశాయి. కానీ నేను మాట్లాడలేకపోయా. కంటిచూపు కూడా సరిగ్గా లేదు. కొద్ది రోజుల తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకుని షాక్ అయ్యా. ఒక కన్ను నల్లగా, సగం గుండుతో కన్పించా. తాలిబన్లు నాకు గుండు గీయించారని అనుకున్నా. కానీ సర్జరీ కోసం డాక్టర్లు షేవ్ చేశారని చెప్పారు. ఒక రోజు నా పొట్టను తడుముకుంటే గట్టిగా తగిలింది. నా పొట్టకు ఏమైందని నర్సును అడిగాను. పాకిస్థాన్‌లో ఆపరేషన్ చేసినప్పుడు పుర్రె ఎముకలో కొంతభాగాన్ని తీసి కడుపులో దాచారని, మరో సర్జరీ చేసిన దాన్ని తలలో అమర్చాలని చెప్పారు. అయితే యూకే వైద్యులు నా పుర్రె ఎముక స్థానంలో టైటానియం ప్లేట్‌ను అమర్చారు. కడుపులో ఉన్న ఎముక భాగాన్ని బయటకు తీశారు. ఇప్పటికీ ఆ భాగం మా ఇంట్లో బుక్ షెల్ఫ్‌లో ఉంది" అని మలాలా(Malala Yousafzai) చెప్పుకొచ్చారు.