తెలంగాణ

telangana

ETV Bharat / international

విషాద 'లంక'లో క్షణక్షణం.. భయం భయం

విషాదం... భయం... శ్రీలంకలో ఎటుచూసినా ఇదే పరిస్థితి. ఆదివారం జరిగిన 8 బాంబు పేలుళ్లతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. 290మందిని బలిగొన్న ఉగ్రఘాతుకంతో నిలువెల్లా వణికిపోయింది. సోదాల్లో ఇంకా బాంబులు బయటపడుతూ ఉండడం... ప్రజలకు, పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

భయం భయం

By

Published : Apr 22, 2019, 1:42 PM IST

Updated : Apr 22, 2019, 2:46 PM IST

శ్రీలంక బాంబు పేలుళ్ల దృశ్యాలు, ప్రస్తుత పరిస్థితి

దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లతో నిర్ఘాంతపోయింది. ఈస్టర్ పర్వదినాన నిమిషాల వ్యవధిలో జరిగిన 8 పేలుళ్లు అక్కడి ప్రజలకు అంతులేని విషాదం మిగిల్చాయి. కొలంబో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పేలుళ్ల బాధితులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.

290 మంది మృతి

బాంబు పేలుళ్ల ఘటనల్లో మృతుల సంఖ్య 290కి పెరిగింది. 500మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

పూర్తి కథనం చూడండి :శ్రీలంక పేలుళ్లలో 290కి చేరిన మృతుల సంఖ్య

ఆరుగురు భారతీయులు

లంక పేలుళ్లలో ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ఇద్దరు జేడీఎస్​ కార్యకర్తలు ఉన్నారు.

పూర్తి కథనం చూడండి: శ్రీలంక దాడుల్లో ఇద్దరు జేడీఎస్​ నేతలు మృతి

అదుపులో 24మంది

పేలుళ్ల ఘటనపై విచారణ ముమ్మరం చేసింది శ్రీలంక ప్రభుత్వం. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధముందనే అనుమానంతో 24 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విచారిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారు మూడు నెలలుగా దక్షిణ కొలంబోలోని పనదురలో నివసిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అదుపులో ఉన్నవారు ఇస్లాం అతివాద సంస్థకు చెందినవారని సమాచారం.

పూర్తి కథనం చూడండి : శ్రీలంక పోలీసుల అదుపులో 24మంది అనుమానితులు

మరో బాంబు కలకలం

ఆదివారం మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లిన శ్రీలంకను ఇంకా పేలుళ్ల భయం వీడలేదు. కొలంబో విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి ఓ బాంబు లభ్యమైంది. పోలీసులు ఆ బాంబును నిర్వీర్యం చేశారు. దేశంలో విమానాశ్రయాలు, ప్రార్థనాలయాలు సహా అన్ని చోట్ల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పూర్తి కథనం చూడండి : శ్రీలంకలో మరో బాంబు నిర్వీర్యం- భయంతో జనం

భయం గుప్పిట్లో...

ఓ వైపు విషాదం... మరో వైపు భయం.. ఇదీ ప్రస్తుతం శ్రీలంక ప్రజల పరిస్థితి. ఆదివారం జరిగిన పేలుళ్ల ధాటికి ఆ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వందలాది మంది మృతితో నిర్ఘాంతపోయారు. ఏ సమయంలో ఎక్కడ బాంబు పేలుతుందోననే భయంతో జీవిస్తున్నారు. రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు.

భద్రత కట్టుదిట్టం.. కర్ఫ్యూ ఎత్తివేత

పేలుళ్లతో దేశవ్యాప్తంగా సైనికులను మోహరించింది శ్రీలంక ప్రభుత్వం. విమానాశ్రయాలు, ముఖ్య ప్రదేశాలు సహా అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి భద్రతా దళాలు. దేశవ్యాప్తంగా ఆదివారం విధించిన కర్ఫ్యూను ఎత్తివేసింది ప్రభుత్వం.

నిఘా విభాగం వైఫల్యమే

బాంబు పేలుళ్లకు అంతర్గత నిఘా విభాగం వైఫల్యమే కారణమని శ్రీలంక పోలీసులు తెలిపారు. దాడులు జరుగుతాయని ఆ విభాగం హెచ్చరికలు ఇవ్వలేకపోయిందన్నారు.

"దాడులు జరుగుతాయని కొందరు అధికారులకు తెలిసినా, చర్యలు చేపట్టడంలో ఆలస్యం చేశారు. హెచ్చరికలు జారీ చేయడాన్ని విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం."
- శ్రీలంక టెలీకమ్యూనికేషన్స్​ మంత్రి హరిన్​ ఫెర్నాండో

పర్యటకంపై దెబ్బ
శ్రీలంకకు పర్యటక రంగం ఓ ప్రధాన ఆర్థిక వనరు. ఏటా లక్షలాది మంది లంకకు వస్తుంటారు. పేలుళ్ల ఘటనతో వచ్చే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని వ్యాపారులు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి కథనం చూడండి : శ్రీలంక పర్యటక రంగంపై పేలుళ్ల ప్రభావం!

దాడులను ఖండించిన దేశాధినేతలు

శ్రీలంక దాడులను బ్రిటన్​, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా సహా మరిన్ని దేశాల అధినేతలు ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. శ్రీలంకకు పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

పూర్తి కథనం చూడండి : శ్రీలంక దాడుల్ని ఖండించిన దేశాధినేతలు

Last Updated : Apr 22, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details