ఈస్టర్ పర్వదినాన జరిగిన ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తూ శ్రీలంక ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) పుజిత్ జయసుందర రాజీనామా చేశారు. పుజిత్ రాజీనామాను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆమోదించారు. నూతన ఐజీని అతి త్వరలోనే నియమిస్తామని తెలిపారు. రక్షణ కార్యదర్శి 'హేమసిరి ఫెర్నాండో' బాధ్యతల నుంచి తప్పుకున్న మరుసటి రోజే పుజిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
'ఉగ్రసంస్థల్లో చేరడం నేరం కాదు'
నిఘా, భద్రతాపరమైన వైఫల్యాలే శ్రీలంకలో వందల మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమన్న వాదనలకు మరింత ఊతమిస్తూ ప్రధాని రణిల్ విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ ఉగ్రసంస్థలో చేరి స్వదేశానికి తిరిగొచ్చిన దేశ పౌరలెవరో ప్రభుత్వానికి తెలుసని వెల్లడించారు. అది చట్టానికి విరుద్ధం కానందున వారిని అరెస్టు చేయలేదని చెప్పారు.