Sri Lanka Crisis: ద్వీప దేశమైన శ్రీలంక గతంలో ఎన్నడూ ఎరగని ఆర్థిక కష్టాలతో విలవిలలాడుతోంది. విదేశాల నుంచి దిగుమతులకూ నగదు చెల్లించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో విదేశ మారక నిల్వలు సైతం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చమురు, నిత్యావసర వస్తువులను సింహళ దేశం దిగుమతి చేసుకుంటోంది. విదేశ మారక నిల్వల కొరతతో లంకలో పెట్రోధరలు విపరీతంగా పెరిగాయి. డాలర్‌తో శ్రీలంక రూపాయి మారకపు విలువ రూ.275కు పడిపోయింది. గ్యాస్, పెట్రోల్, పాలపొడికోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. వాటికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇనుము, సిమెంట్, ఔషధాల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో కోట్ల మంది ప్రజలు ఆహారంకోసం అలమటిస్తున్నారు. క్యూలలో నిల్చొనే శక్తిలేక ఇప్పటికే కొందరు వృద్ధులు కన్నుమూశారు.
కుదేలైన పర్యాటక రంగం
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గతేడాది పురుగు మందులు, రసాయన ఎరువులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. రైతాంగాన్ని సన్నద్ధం చేయకుండానే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపి ఆహార సంక్షోభానికి దారి తీసింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో చొరబాటుకు యత్నిస్తున్న చైనాకు శ్రీలంక భారత వ్యతిరేక వైఖరి మంచి అవకాశంగా కనిపించింది. రెండు దశాబ్దాలుగా రుణాలిస్తూ సింహళ దేశాన్ని రుణ ఊబిలోకి లాగింది. వడ్డీలు చెల్లించకపోవడంతో ఏకంగా హంబన్‌టొటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది. శ్రీలంక పాలకులు సైతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద రుణాలకు యత్నించకుండా డ్రాగన్ వద్దే తీసుకున్నారు. ఆ అప్పుల వడ్డీలకే తమ ఆదాయాన్ని వెచ్చిస్తుండటంతో దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
గత సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించారు. ఫలితంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల సరఫరా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. శ్రీలంక జీడీపీలో అయిదు నుంచి 10శాతం పర్యాటక రంగంనుంచే సమకూరుతుంది. కొవిడ్ అనంతరం విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 70శాతం తగ్గింది. శ్రీలంక అంతర్జాతీయ పర్యాటకుల్లో 20శాతందాకా రష్యా, ఉక్రెయిన్ నుంచే ఉంటారని అంచనా. యుద్ధం కారణంగా అక్కడినుంచి సందర్శనలు దాదాపుగా నిలిచిపోయాయి. చైనా నుంచీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. మరోవైపు యూరోపియన్ సమాఖ్య దేశాలకు శ్రీలంక ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఎల్‌టీటీపై పోరులో భాగంగా శ్రీలంక సైన్యం అనేక యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కొంటోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈయూ కోరుతోంది. మానవ హక్కులకు విఘాతంగా మారిన ఉగ్రవాద నియంత్రణ చట్టాన్ని రద్దు చేయాలని సూచిస్తోంది. లేకుంటే శ్రీలంక నుంచి వస్తున్న ఉత్పత్తులకు అందిస్తున్న రాయితీని ఎత్తివేస్తామని హెచ్చరించింది. అదే జరిగితే కొలంబో ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాల్లో కూరుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే సింహళ జాతీయ వాదులతో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంక తమిళులు భారత్‌కు శరణార్థులుగా వస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి సంఖ్య మరింతగా పెరిగితే వసతులు కల్పించడానికి తమిళనాడుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.