లంకలో అత్యయిక స్థితి,, సైన్యానికి విస్తృతాధికారాలు శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ సైన్యానికి ప్రత్యేక అధికారాలు కల్పించింది ప్రభుత్వం. ఇక నుంచి వారు అనుమానితులను అదుపులోని తీసుకుని నిర్బంధించే అధికారమిచ్చింది. దేశంలో అస్థిరత నెలకొనే ప్రమాదం ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ప్రజల భయాందోళనలు మరింత పెంచేలా సోమవారం కొలంబో బస్ డిపోలో పదుల సంఖ్యలో డిటోనేటర్లను గుర్తించారు అధికారులు.
అత్యయిక పరిస్థితి అమలు...
శ్రీలంకలో సోమవారం అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీగా భద్రతా బలగాలను మోహరించి విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 300మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు.
మృతుల్లో 8 మంది భారతీయుులు
బాంబు దాడుల్లో మరణించిన వారిలో 8 మంది భారతీయులున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో మొత్తం 31 మంది విదేశీయులున్నారు.
కుదేలైన పర్యటక రంగం
ప్రపంచ పర్యటకులకు అనువైన ప్రదేశంగా శ్రీలంకకు మంచి గుర్తింపు ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది సందర్శించాలనుకున్న ఉత్తమ దేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈస్టర్ రోజున వరుస పేలుళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పర్యటక రంగం కుదేలైంది. సరదాగా సేద తీరేందుకు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన పర్యటకులు ప్రతి క్షణం బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. దేశం వీడి వెళ్లేందుకు విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాలని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: విషాద 'లంక'లో క్షణక్షణం.. భయం భయం