శ్రీలంకలో మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. బౌద్ధాలయాలే లక్ష్యంగా మహిళా ఆత్మాహుతి దళం దాడులకు పాల్పడనున్నట్టు సమాచారం సేకరించాయి లంక నిఘా సంస్థలు.
ఈస్టర్ నాటి పేలుళ్ల తర్వాత ఓ ఇంటిలో తెల్లటి వస్త్రాలను గుర్తించారు పోలీసులు. వాటికి సంబంధించిన విచారణలో భాగంగా మరిన్ని అంశాలను శ్రీలంక నిఘా సంస్థ పసిగట్టింది. ఈ దుస్తులు నిషేధిత ఉగ్రసంస్థ తౌవీద్ జమాత్‌కు చెందిన మహిళా ఆత్మాహుతి సభ్యులవిగా గుర్తించారు.
మొత్తం 9 మందికి సరిపోయే తెల్లటి వస్త్రాలను కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే ఇంటిలో మాత్రం ఐదుగురికి సరిపడే దుస్తులు మాత్రమే కనిపించాయి. ఇందులో ఒకరు ఈస్టర్ దాడిలో పాల్గొన్నట్టు నిఘా సంస్థ చెబుతోంది.